అసలే శీతకాలం.. దానికి ఫెంగల్ తుఫాను తోడవ్వడంతో ‘చలి పులి’ పంజా విసురుతున్నది. తేలికపాటి వర్షం కూడా కురుస్తుండటంతో.. చలి తీవ్రత మరింత పెరుగుతున్నది. దాంతో రాత్రయ్యిందంటే.. చిన్నాపెద్దా అంతా ముసుగు తన్ని పడుకుంటున్నారు. అయితే.. ఇలా తెల్లవార్లూ ముఖం నిండా దుప్పటి కప్పుకొని పడుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. బెడ్‌షీట్‌తో ముఖం అంతా కవర్ చేసుకుంటే.. శ్వాస సమస్యలు ఏర్పడతాయనీ, ఫలితంగా గుండె కొట్టుకోవడంలోనూ మార్పులు వస్తాయనీ చెబుతున్నారు. శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ పూర్తిస్థాయిలో అందక.. గుండె సమస్యలు తలెత్తవచ్చు.
ఆరోగ్యవంతుల్లోనూ తలనొప్పి, వాంతులు, వికారం లాంటి సమస్యలు ఎదురవుతాయనీ, క్రమక్రమంగా ఆస్తమాకూ దారితీయొచ్చని చెబుతున్నారు. అంతేకాదు.. చలికాలంలో ఎక్కువగా బ్లాంకెట్లు, మందపాటి రగ్గులు వాడుతుంటారు. వీటిని ఉతకడం కష్టం కాబట్టి.. రెండుమూడు వారాలకు ఒకసారి ఉతకడానికి వేస్తుంటారు. దీంతో అవి మురికి కూపంగా, క్రిములకు అడ్డాగా మారిపోతాయి. వాటితో ముఖం నిండుగా కప్పుకొని పడుకుంటే.. శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. అందుకే.. రాత్రిపూట పూర్తిగా ముఖాన్ని కప్పుకొని పడుకోవద్దని సూచిస్తున్నారు.