రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతున్నది. దీనికితోడు వాతావరణ కాలుష్యం ఉండనే ఉన్నది. ఈ పరిస్థితులు మనుషులనే కాదు పెట్స్‌ను కూడా ఇబ్బందిపెడుతుంటాయి. తమ కష్టం చెప్పుకోలేని ఈ మూగజీవాల కదలికలను బట్టి వాటికేం సమస్య ఉందో గుర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో నగరాల్లో ఉండే తీవ్రమైన కాలుష్యం బారినపడి కుక్కలు, పిల్లులు, ఇతర పెంపుడు జంతువులు తొందరగా అనారోగ్యం పాలవుతుంటాయి. ముఖ్యంగా పొట్టిముక్కు ఉండే పగ్, బుల్ జాతి కుక్కలు, పర్షియన్ పిల్లులు పెంచుకునేవాళ్లు అప్రమత్తంగా ఉండాలి. వీటి శరీర పరిమాణం తక్కువగా ఉంటుంది. శ్వాస అధికంగా తీసుకుంటాయి. అందువల్ల కాలుష్య కారకాలు వీటి శరీరంలోకి అధికంగా చేరతాయి.
మానవ శరీరంలో చేరే కాలుష్య కారకాల కంటే వీటి దేహాల్లోకి చొరబడే కాలుష్య కారకాలు అధికం. చలికి, కాలుష్యానికి మనుషుల కంటే తొందరగా ఇవి ప్రభావితమవుతాయి. కాబట్టి పెంపుడు జంతువుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. గాలిలో ఉండే విషవాయువుల వల్ల పెంపుడు జంతువుల వాయునాళాల్లో వాపులు సంభవిస్తాయి. అస్తమా బారినపడతాయి. ఫలితంగా దీర్ఘకాలిక శ్వాస సంబంధమైన జబ్బులకు గురవుతాయి. వాటిలో వ్యాధినిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ఒంట్లో సమస్యలు ఉన్నప్పుడు జంతువుల కండ్లు ఎర్రబడతాయి. దురద కారణంగా కాళ్లతో తరచూ గోక్కోవడం లాంటివి చేస్తుంటాయి. మీ పెట్స్‌లో ఇలాంటి లక్షణాలు గమనించినట్లయితే వైద్యులను సంప్రదించడం మంచిది. నిర్లక్ష్యం చేస్తే వాటి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చు.