శ్రీమద్భాగవతం శ్రీకృష్ణలీలామృత సాగరం. ఈ లీలలన్నీ అప్రాకృతాలు- అభౌతికాలు, చిన్మయాలు. అధ్యాత్మ తత్త రహస్య భావనాగర్భితాలు. అనంత రస వర్షకాలు. అవి భౌతికాల వలె కనిపించినా చక్కగా విచారణ జరిపితే జీవుల భౌతిక- ప్రాపంచిక వాసనలను, జీవత్వాన్ని పూర్తిగా తొలగించి చిన్మయత్వాన్ని ప్రసాదిస్తాయి. జీవుల కర్మలు కర్తృత్వ బుద్ధి (అహంకారం)తోను, స్వార్థం (మమకారం)తోను కూడి ఉంటాయి. కనుక, అవి బంధకాలు- జన్మ సంసార బంధనాలు కలిగిస్తాయి. కాని, (జన్మకర్మ చ మే దివ్యం- గీత) దేవదేవుని కర్మలు దివ్యములు. కాన మోచకాలు- జీవుల బంధనాలు తొలగిస్తాయి. వీటికి ‘లీలలు’ అని పేరు. ‘లయనం లాతి ఇతి లీలా’- మనస్సును లయింపజేసి ముక్తిని కలిగించేదే లీల.
‘మనోనాశో మహోదయః’- మనస్సు నశించుటే మోక్షమని శాస్త్రం. అయితే, బాలకృష్ణుని లీలా విమర్శ చేసేటప్పుడు అతని నామ, రూప, గుణచేష్టలు ప్రాకృతాలు- పాంచభౌతికాలు కావు అన్న విషయం చాలా ముఖ్యం. ‘న భూత సంఘ సంస్థానో దేవస్య పరమాత్మనః..’ అని మహాభారతంలో వ్యాస వచనం. ‘దామోదర భగవంతునిలో ‘దేహము- దేహి’ అన్న భేదం ఉండదు. ఆయన శరీరం పాంచ భౌతికం కాదు. అలా భూత సముదాయంగా భావించేవారు కర్మాధికారాన్ని కోల్పోతారు. అట్టివారి ముఖం చూసినా సచేల స్నానం చెయ్యాలి’. అంటే, అది అంతగా దోషావహమన్నమాట! భాగవతంలోని నవనీత చౌర్యం, చీర (వస్త్ర) హరణం, రాసలీల- ఇవన్నీ దివ్య చిన్మయి లీలలు. కాని, అధిక ఆక్షేపణకు, అపార్థాలకు గురైన ఘట్టాలు.
సారసాక్షులు- గోపికలు యమునలో స్నానాలు చేస్తుంటే వారిజాక్షుడు కృష్ణుడు ఆ కామినుల చీరలు హరించుకపోవడం అశ్లీలం, అయోగ్యం, అసభ్యం కాదా?- అని అధిక్షేపం, నింద. నిజమే మరి! అజుడు, సర్వేశ్వరుడు శ్రీహరి చేశాడు కాన సరిపోయింది. కాని, ఒరుడు- మానవ మాత్రుడైతే అది దానవ చేష్ట- దుర్మార్గమేగా మరి? గోప కుమారికలే… ‘ఓ నందగోప కుమారా! కుందరదనలు- స్త్రీలు ఆనందంగా జలకాలాడుతుంటే, ఆ చాయలకు మగవారు రావడం తుంటరితనం కాదా? వచ్చి వారిని ఇలా అల్లరి పెట్టొచ్చునా?’ అని అడిగారు. మహాభారతంలోని ద్రౌపదీ వస్ర్తాపహరణం దుష్టచతుష్టయ దురాగతం. అది నీచం, నికృష్టం. పరాత్పరుని కరావలంబనంతో- ప్రశస్తమైన అక్షయ చీర- వస్త్రదానంతో అది ఘోరంగా నిరస్తం- విఫలమైపోయింది. ‘పాంచాలీ కబరీ వికర్షణ మహాపాప క్షతాయుష్కులన్’ అన్నాడు అమాత్యుడు పోతన్న. నిండుసభలో యాజ్ఞసేని- ద్రౌపది వేణి పట్టి లాగిన మహాపాపం వల్లనే కౌరవుల ఆయుస్సులు క్షీణించాయి, వట్టిపోయాయి. కాని, భాగవత గోపికా చీరహరణం భగవంతుని- యదువీరుని లీల! నిష్కలుడైన కృష్ణానుగ్రహంతో అది పుష్కలంగా ఫలించింది. భాగవతం భగవత్తత్త్వ ప్రతిపాదకం. మోక్ష గ్రంథం. భాగవత కర్త విశాల బుద్ధి వేదవ్యాసుడు, అపర నారాయణుడు. వక్త- బోధక చక్రవర్తి, అవధూత… శుకబ్రహ్మ. శ్రోత- ముముక్షువై ప్రాయోపవిష్టుడైన సాధక శిరోమణి పరీక్షిత్తు. అదీకాక, ‘భక్త్యా భాగవతం, జ్ఞేయం’- భాగవతం భక్తి భావ గమ్యం. భాషా, పాండిత్య గమ్యం కాదు. ‘భగవత్తత్త్వం అలౌకికం. దానిని ప్రతిపాదించడానికి ‘అలౌకిక’ భాష అంటూ ఒకటి ప్రత్యేకంగా లేదుగా మరి! కనుకనే లౌకిక భాషలోనే అలౌకిక తత్తాన్ని తెలియపరచవలసి వచ్చింది’ అంటూ చక్కగా శెలవిచ్చారు భూమానంద ఆశ్రమస్వామి శ్రీరామకృష్ణానంద.
భాగవత భాషను ‘సమాధి భాషా వ్యాసస్య’- సమాధి భాషగా వక్కాణించారు వల్లభాచార్య స్వామి. పరమార్థాన్ని- ఉత్కృష్టమైన బ్రహ్మనిష్ఠకు సంబంధించిన ప్రతిభను, ప్రాభవాన్ని ప్రతిబింబింప జేసేదే సమాధి భాష. ఈ ఘట్టంలోని గోపికలు గోపికలు కారు. కృష్ణుడు కేవలం యశోదానందనుడు కాడు. ‘నఖలు గోపికా నందనో భవాన్’- ‘నీవు యశోద బిడ్డడవే? నీజరనేత్ర! సమస్త జంతు చే/ తో విదితాత్మ వీశుడవు..’ (కమలాక్షా! నీవు కేవలం యశోద కుమారుడవే కాదయ్యా! అఖిల దేహధారుల బుద్ధికి సాక్షీ భూతుడవైన అంతరాత్మవు, పరమేశ్వరుడవు) అని గోపికలు గానం చేశారు. ఆయన గ్రహించిన వస్ర్తాలు వస్ర్తాలూ కావు. ఇవన్నీ పరమార్థానికి ప్రతీకలు. ఇదంతా సాంకేతిక భాష, భక్తి భాష! త్రిగుణాలతో కూడిన జీవులందరూ గోపికలే, స్త్రీలే. సృష్టిలో జగన్నాథుడు ఒక్కడే పురుషుడు- గుణాతీతుడైన పురుషోత్తముడు! వస్త్రమంటే ఆవరణం- అజ్ఞానం, దేహాత్మ బుద్ధి. దేహమే నా స్వరూపమనే అభిమానం- అహంకారం. వస్త్రం దేహాన్ని కప్పునట్లు దేహం (దేహాత్మబుద్ధి, అజ్ఞానం) ఆత్మని, స్వరూపాన్ని- జ్ఞానాన్ని ఆవరించి ఉంది. ‘అజ్ఞానేన ఆవృతం జ్ఞానం’- గీత. జీవుల అజ్ఞాన ఆవరణాన్ని- తస్కరించడమే గోపికల అంబర (వస్త్ర) అపహరణ! ‘దదామి బుద్ధి యోగం’- గీత. బుద్ధి యోగం ఇవ్వడమంటే ఇదే.
చీరహరణ, రాసలీల ప్రసంగాలలో భక్తకవి పోతన కవితా చేతనా స్రవంతి భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ముప్పిరిగొని త్రివేణియై వెల్లివిరిసి భావుక భక్తుల హృదయ కేదారా-క్షేత్రాలలో బ్రహ్మానందపు పంట పండించింది. ‘హేమంతే ప్రథమే మాసి’ (హేమంత రుతువు మొదటి నెల మార్గశిరంలో) అని మాత్రమే మూలపాఠం. సహజ పాండిత్యుడు పోతన్న రుతు స్వభావాన్ని- ప్రకృతి ధర్మాల మర్మాలను ఆరు కందాలలో, రెండు ఆటవెలదులలో, ఒక వృత్తంలోనూ విస్తరించి కమనీయ కల్పనలతో కావ్యాత్మకంగా ఎంతో రమణీయంగా ప్రస్తుతించాడు. శుకుడు పరీక్షిత్తుతో..
కం॥ ‘శామంతికా స్రగంచిత
సీమంతవతీ కుచోష్ణ జితశీత భయ
శ్రీమంతంబయి గొబ్బున
హేమంతము దోచె, మదనుడేచె విరహులన్’
‘రాజా! హర్షంతో కూడిన వర్ష, శరదృతువులు గడచిపోగా అంతలోనే శ్రీమంతమైన హేమంతం- శీతకాలం రానే వచ్చింది. చేమంతి పూబంతులు పూనిన (ధరించిన) సీమంతినుల (భార్యల) కుచముల పొత్తు వలని వేడిమిచే పురుషులకు చలిభయం చిత్తు-చిత్తుగా ఓడి మత్తుగా వీడిపోయింది. అదను చూసుకొని మదనుడు- మన్మథుడు పాగా వేసి కదం తొక్కుతూ విరహులను దయారహితంగా బాగా వేధించాడు’. ఉత్తరపు గాలులు వీచాయి. మింట చందురుడు మంటలు రేపాడు. దంపతులకు ఇంపుగా పొత్తు కుదిరింది. అంతటా మంచు అలముకొనడం చేత తామరలకు శోభ తరిగిపోయింది. పగటి వేళలు సన్నగిల్లి రాత్రి పొద్దులు హద్దులు మీరాయి. భగ్గున మండే అగ్గి చలి ఎగ్గు (బాధ)ను తొలగించి అందరికీ హాయిని కూర్చింది.
ఆ॥ ‘శంభు కంటి నొకటి జలరాశి నొక్కటి
మరియు నొకటి మనుజ మందిరముల
నొదిగెగాక మెరిసియున్న మూడగ్నులు
చలికి నులికి భక్తి సలుపకున్నె?’
రాజా! చలిదెబ్బకు ఉలికిపడి (భయపడి) ఇల- లోకంలోని మూడు అగ్నులలో ఆహవనీయమనే అగ్ని అహిభూషణుని, మహాదేవుని, అంతకాంతకుని- శివుని చెంతచేరి అంతలోనే ఆయన అగ్నినేత్రంలో అణగిపోయింది. గార్హపత్య అగ్ని గృహస్థుల సదనాల (ఇళ్ల)లో ఒదిగిపోయింది. దక్షిణాగ్ని సాగరుని కుక్షిలో చొచ్చి బడబాగ్నిగా నిక్షిప్తమైపోయింది. అలాకాక అవి వెలుపలే ఉండి ఉంటే చలికి చిక్కి పలువిధాల దానికి సేవలు చేస్తూ ఉండేవే!
శా॥ ‘ఈ హేమంతపు రాకజూచి రమణీ హేలా పరీరంభ స
త్సాహాయంబున గాని దీని గెలువన్ శక్యంబు గాదంచు దా
రూహాపోహ విధిం ద్రిమూర్తులు సతీయుక్తాంగులైనారుగా
కోహో! వారల దేమి సంతత వధూయోగంబు రా గందురే?’
బ్రహ్మవిష్ణు మహేశ్వరులు కూడా హేమంతపు రాకను చూచి, తమ తరుణీమణుల బిగి కౌగిళ్ల కాక (వేడిమి) లేకపోతే దీనిని జయించడం మనవల్ల కానేకాదు, మనకిక పోడిమి (సౌఖ్యం) లేనేలేదని భావించారు కాబోలు, వారు తమ సతులను- సరస్వతీ, లక్ష్మీ, పార్వతులను (విరించి వాణిని వాక్కు (ముఖం)లోను, విష్ణువు శ్రీదేవిని వక్షఃస్థలంలోను, శివుడు శర్వాణిని ఏకంగా శరీరంలో సగభాగంగానూ) తమ ఒంటికే- దేహానికే అంటగట్టుకొన్నారు. కాకపోతే ఆ త్రిమూర్తులు సదా ఆ స్త్రీమూర్తులతో అలా అవినాభావంగా ఎందుకు అలరారుతూ, అంటకాగుతూ ఉంటారు?