ఇంటికి కొత్తగా వచ్చిన బంధువులతో కొందరు పిల్లలు సరిగ్గా కలవలేరు. సిగ్గు పడుతూ.. బిడియంతో ముడుచుకు పోతారు. ఇంటికొచ్చిన అతిథుల విషయంలోనే కాదు.. క్లాస్‌లో తోటి విద్యార్థులతోనూ సరిగ్గా కలవలేరు. దాంతో, వారి ఫ్రెండ్స్ లిస్ట్‌లో కొద్దిమందే ఉంటారు. అయితే, ఇలాంటి సమస్యను బాల్యంలోనే గుర్తించి.. వారిలో మార్పు తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే, పెద్దయ్యాక అంతర్ముఖులుగా తయారయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. ఈ అలవాటు దీర్ఘకాలంలో వారిలో నమ్మకం, సామాజిక సంబంధాలపై ప్రభావం చూపుతుందనీ చెబుతున్నారు. పిల్లల్లో సిగ్గూ, బిడియం తగ్గాలంటే.. కొన్ని సలహాలు, సూచనలు పాటించాలని సూచిస్తున్నారు.
పిల్లలు ఎక్కువగా సిగ్గు పడుతున్నారంటే.. ఇందుకు జన్యుపరమైన కారణాలు, గత అనుభవాలు, వ్యక్తిత్వ లక్షణాలు కారణం కావచ్చు. కాబట్టి, ముందుగా మీ పిల్లల సమస్య ఏమిటో గుర్తించండి. వేర్వేరు పరిస్థితుల్లో వారి ప్రవర్తనను గమనించండి. జన్యుపరమైన కారణాలైతే.. వైద్య నిపుణులను సంప్రదించాలి. ఇక గత అనుభవాలు, వ్యక్తిత్వ లక్షణాలతో సిగ్గుపడుతుంటే.. వారికి తగిన సూచనలు ఇవ్వండి.
ఎట్టిపరిస్థితుల్లోనూ పిల్లవాడిపై ‘సిగ్గరి’ అనే ముద్రను వేయకండి. ఇది వారి మానసిక అభివృద్ధిని అడ్డుకుంటుంది. వారిలో నమ్మకాన్ని తగ్గిస్తుంది.
పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచండి. తమపై తమకు నమ్మకం ఉన్న పిల్లలు.. సిగ్గుపడే అవకాశం తక్కువగా ఉంటుంది. మీ పిల్లల్లో దాగిఉన్న ప్రతిభను గుర్తించి.. దాన్ని ప్రోత్సహించండి. ఆటలు, చిత్రకళ, గానం.. ఇలా వారికి ఆసక్తి, సామర్థ్యం ఉన్న రంగంలో పిల్లలకు మద్దతుగా నిలవండి. తాను ప్రతిభావంతుడు, సమర్థుడినని తెలుసుకున్న పిల్లలు.. సామాజికంగా మరింత ధైర్యంగా వ్యవహరిస్తారు.
పిల్లల చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడూ వారికి సురక్షితంగా అనిపించాలి. అప్పుడే, వారు ఇతరులతో కనెక్ట్ కావడానికి ఆసక్తి చూపుతారు. వాతావరణం తమకు నచ్చినట్లుగా ఉంటే.. పిల్లల్లో ఆందోళన తగ్గుతుంది. వారిలో నమ్మకాన్నీ పెంచుతుంది. దాంతో, బిడియం తగ్గుతుంది.
పిల్లలు ఇతరులతో కలిసేలా, వారితో మాట్లాడేలా ప్రోత్సహించాలి. ఇతరులతో స్నేహంగా మెలిగినప్పుడు.. పిల్లల్లో సిగ్గు, బిడియం తగ్గుతుంది. వారిలో సామాజిక నైపుణ్యాలు, నమ్మకాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇక పిల్లలకు తప్పకుండా నేర్పించాల్సిన మరో సామాజిక నైపుణ్యం.. ఇతరులను పలకరించడం.
ఇందుకు వారి మిత్రులే అవ్వాల్సిన అవసరం లేదు. మీ స్నేహితులు, బంధువులు ఎదురుపడినా.. విష్ చేసేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. పిల్లలు స్వతంత్రంగా విజయాలు సాధించడం మంచిదే! అదే సమయంలో.. సామాజికంగానూ, బృందంగానూ విజయం సాధించేలా వారికి అవకాశాలను కల్పించండి. నలుగురితో కలిసి ఆడుకోవడాన్ని ప్రోత్సహించండి.