తరాలు మారుతున్న కొద్దీ.. పిల్లల పెంపకంలోనూ మార్పు వస్తున్నది. ఒకప్పుడు విలువలే.. తల్లిదండ్రుల తొలి ప్రాధాన్యంగా ఉండేది. ఆ తర్వాత కాలంలో.. చదువు, డబ్బుకు ప్రాధాన్యత పెరిగింది. అయితే, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. పిల్లలకు సమయం కేటాయించడమే కష్టమైపోతున్నది. వారికి ఉన్నత విలువలు.. ఆరోగ్యకరమైన అలవాట్లను నేర్పించడం గగనమే అవుతున్నది. ఫలితంగా.. వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతున్నది. అలా కావొద్దంటే.. వారికి బాల్యం నుంచే ఉన్నత విలువలను నేర్పించాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే వారి భవిష్యత్తుకు బంగారు బాట పడుతుంది.
చిన్న కుటుంబాలు, పెద్దల పర్యవేక్షణ లేకపోవడం.. నేటితరానికి శాపంగా పరిణమిస్తున్నాయి. చాలామంది పిల్లల్లో మంచి, మర్యాద లోపిస్తున్నది. ఈక్రమంలో వారికి పెద్దలతో ఎలా ప్రవర్తించాలో నేర్పాల్సిన అవసరం ఉంది. థాంక్యూ, సారీ, ప్లీజ్.. లాంటి మాటలను బాల్యం నుంచే అలవాటు చేయాలి. అవసరంలో ‘డిమాండ్’ కాకుండా.. ‘రిక్వెస్ట్’ చేసేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. ఇలాంటి మంచి, మర్యాదలే.. పిల్లల సామాజిక నైపుణ్యాలను పెంచుతాయి. వారి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి.
పిల్లలకు బాల్యం నుంచే ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి. అప్పుడే.. పెద్దయ్యాక ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా ఉంటారు. ఆర్థిక సమస్యలు ఎదురైనా.. సులభంగా బయటపడతారు. పాకెట్ మనీని ఎలా వాడుకోవాలో నేర్పించాలి. ఖర్చులను ఎలా ప్లాన్ చేసుకోవాలో, డబ్బును ఎలా ఆదా చేసుకోవాలో చెప్పాలి. అంతేకాకుండా.. బ్యాంకు అకౌంట్‌ను నిర్వహించడం, చెక్కులు రాయడం, డిపాజిట్లు చేయడం వంటి బ్యాంకింగ్‌కు సంబంధించిన ప్రాథమిక నైపుణ్యాలపై అవగాహన కల్పించాలి.
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే సత్యాన్ని.. పెద్దలు గ్రహించి, పిల్లలకూ బోధించాలి. పొద్దెక్కేదాకా పడుకోకుండా.. తెల్లవారుజామునే నిద్ర లేవడం అలవాటుగా మార్చాలి. ఉదయం వ్యాయామం నుంచి మొదలుపెడితే.. పోషకాహారం తినడం, ఆరుబయట ఆటలాడటం, కంటి నిండా నిద్రపోవడం వరకూ.. అన్నీ ఆచరించేలా ప్రోత్సహించాలి. ఆరోగ్యకరమైన అలవాట్లతోనే జీవితం ఆనందంగా సాగుతుందనే విషయాన్ని వారికి చెప్పాలి.
ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తున్న స్మార్ట్‌ఫోన్.. వారికి చెడు వ్యసనాలనూ పరిచయం చేస్తున్నది. అందుకే, ఎదిగే పిల్లల ఫోన్, కంప్యూటర్‌పై ఓ కన్నేసి ఉంచాలి. వారు ఏం చేస్తున్నారో.. ఏం చూస్తున్నారో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. పిల్లలను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచడానికి ముందు.. పెద్దలు మారాలి. ఏవైనా చెడు వ్యసనాలు ఉంటే వెంటనే మానేసి, పిల్లలకు ఆదర్శంగా నిలవాలి. పిల్లల ముందే సిగరెట్లు, మద్యం తాగడం మానుకోవాలి.
బాల్యం నుంచే బాధ్యతాయుతంగా ఉండటం నేర్పించాలి. డబ్బు విషయంలోనే కాదు.. అవసరం ఉన్నవారికి సహాయం చేయడం, ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం, చిన్నచిన్న ఇంటి పనులను చక్కబెట్టడం లాంటివి అలవాటు చేయాలి. ఇలాంటివి పిల్లల్లో మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తాయి.