కావలసిన పదార్థాలు
కూర దోసకాయ: ఒకటి, మటన్: అర కిలో, పచ్చికొబ్బరి తురుము: అరకప్పు, ఉల్లిగడ్డ: ఒకటి(పెద్దది), పచ్చిమిర్చి: నాలుగు, నూనె: అరకప్పు, కరివేపాకు: రెండు రెబ్బలు, గసగసాలు: ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు: పది, గరం మసాలా: ఒక టీస్పూన్, కారం: రెండు టీస్పూన్లు, అల్లం: ఒక టేబుల్ స్పూన్, పసుపు: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: కొద్దిగా, నెయ్యి: ఒక టీస్పూన్.
తయారీ విధానం
ముందుగా మటన్‌ను బాగా కడిగి అరగంట పాటు ఉప్పు నీళ్లలో నానబెట్టాలి. స్టవ్‌మీద కుక్కర్ పెట్టి మటన్‌తోపాటు లీటరు నీళ్లు పోసి మూత బిగించి ఎక్కువ మంటమీద పెట్టాలి. ఏడు విజిల్స్ వచ్చాక దించేయాలి. మిక్సీగిన్నెలో పచ్చికొబ్బరి తురుము, జీడిపప్పు, గసగసాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దోసకాయను తొక్కతీసి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె వేడయ్యాక కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. అన్నీ వేగాక దోసకాయ ముక్కలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, పచ్చికొబ్బరి మిశ్రమం కూడా జోడించి వేయించాలి. అన్నీ బాగా వేగాక మటన్ ఉడికించిన నీళ్లు పోసి, మూతపెట్టి సన్నటి మంటపై పది నిమిషాలు ఉడకనివ్వాలి. మిశ్రమం మరుగుతుండగా మటన్ ముక్కలు, తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించుకుంటే నోరూరించే దోసకాయ మటన్ సిద్ధం.