ఇటీవలి కాలంలో మెజారిటీ జనాభాలో అత్యధిక విటమిన్ లోపం ఏది అని అడిగితే విటమిన్-డి, దాని తర్వాతి స్థానంలో విటమిన్ బి-12లే ఉంటున్నాయి. అయితే సూర్యరశ్మి ద్వారా విటమిన్-డి ని శరీరం తయారు చేసుకోవాలి. వివిధ కారణాల వల్ల ఇది సరిగ్గా అందక లోపం ఏర్పడటం కారణంగా మన వాళ్లు సప్లిమెంట్ల రూపంలో ఈ విటమిన్‌ని తీసుకుంటున్నారు. అయితే మన శరీరానికి ఆ విటమిన్ ఎంత అవసరం, ఎంత లోపం ఉంది అన్నదాన్ని బట్టే సప్లిమెంట్లను వాడాలేగానీ ఎడాపెడా వాడటం వల్ల లేనిపోని రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మిగతా విటమిన్లు నీళ్లలో కరిగేవి, కానీ విటమిన్ డి మాత్రం కొవ్వులో కరుగుతుంది.
దీని కారణంగా మిగతా విటమిన్లలా ఒకవేళ శరీరం ఉపయోగించుకోని పక్షంలో మూత్రం ద్వారా ఇది బయటికి వెళ్లిపోదు. అందుకు బదులుగా కణాల్లో పేరుకుపోతుంది. దాని వల్ల ‘హైపర్ విటమినోసిస్ డి’ అనే వ్యాధి బారిన పడతారు. దీని వల్ల శరీరంలో క్యాల్షియం ఎక్కువ అవుతుందట. దాంతో ధమనులు, కిడ్నీలు ప్రభావితమవుతాయి. అందుకే చలికాలమైనా, మరేకాలమైనా సరే రక్తపరీక్ష చేయించుకుని విటమిన్-డి ఎంత ఉంది అన్నదాన్ని నిర్థారించుకోవాలి. దానికి తగిన మోతాదులో సప్లిమెంట్లు తీసుకోవాలే కానీ నేరుగా తీసుకోవడం అన్నది ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు.