అన్ని బాధ్యతలు తీరినా, కావాల్సినంత సమయం ఉన్నా, ఆరోగ్యం నిలకడగా ఉన్నా.. వృద్ధాప్యంలో వెంటాడే సమస్య నిద్రలేమి. ఇందుకు ప్రధానమైన కారణం ఒంటరితనమే అని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ఒంటరితనంతో మనిషి లేనిపోని ఆలోచనల వలయంలో చిక్కుకుంటాడు. పిల్లలు ఎవరి జీవితంలో వాళ్లు సెటిలయ్యారన్న తృప్తి ఉన్నా.. తమ దగ్గర లేరన్న బెంగ మనసును తొలిచేస్తూ ఉంటుంది. తమకు ఏదైనా జరిగితే పిల్లలు వస్తారో, రారో అన్న అనుమానం కూడా వెంటాడుతుంది.
ఇవన్నీ వయసు పైబడిన వారి మనసులో బలంగా నాటుకుపోతాయి. పైకి ఆరోగ్యంగా కనిపించినా, మానసికంగా ఆందోళనగా ఉంటారు. ఫలితంగా రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. మనసు ఉత్సాహంగా లేకపోతే.. తీసుకునే ఆహారంపై ఆ ప్రభావం పడుతుంది. అన్యమనస్కంగా తినడం, భోజనాన్ని స్కిప్ చేయడం లాంటివి చేస్తుంటారు. దీనివల్ల ఆరోగ్యం కుంటుబడుతుంది. విటమిన్ల లోపం తలెత్తి కాళ్లుచేతులు లాగడం మొదలవుతుంది.
రక్తహీనత కూడా వెంటాడుతుంది. ఇవన్నీ నిద్రను దెబ్బతీస్తాయి. నిద్రలేమితో సతమతం అవుతుంటే.. వైద్యుణ్ని సంప్రదించండి. మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలు ఉన్నట్లయితే.. వైద్యులు సూచించిన మందులు సమయానికి తీసుకోవాలి. కొన్నిసార్లు మందుల మోతాదులు తగ్గించడం, మార్చడం వల్ల కూడా నిద్రలేమి సమస్యకు చెక్‌పెట్టొచ్చు. అయితే, మందుల విషయంలో సొంత నిర్ణయం తీసుకోకుండా, మీ వైద్యుణ్ని సంప్రదించాలని గుర్తుంచుకోండి. కొందరు మధ్యాహ్నం పూట ఎక్కువ సమయం నిద్ర పోతుంటారు. ఆ ప్రభావం రాత్రి నిద్ర మీద పడుతుంది.
కాబట్టి, మధ్యాహ్నం వేళ.. కాసేపే నడుం వాల్చండి. అలాగే, ఉదయం, సాయంత్రం నడక తప్పనిసరి చేసుకుంటే.. ఇది రాత్రి నిద్రకు ఉపకరిస్తుంది. రాత్రి తేలికపాటి భోజనం చేయడం మంచిది. తిన్న తర్వాత ఓ పదిహేను నిమిషాలు నడక సాగించండి. పడుకునే ముందు ఫోన్ పక్కన పెట్టండి. శ్రావ్యమైన సంగీతం వినండి. కాసేపు పుస్తకం చదవండి. పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగితే మంచిది. అన్నిటికీ మించి.. జీవితం చూసొచ్చిన మీరు.. గతాన్ని తవ్వుకుంటూ కాలాన్ని వృథా చేసుకోకండి. మానసికంగా ప్రశాంతంగా ఉంటే.. నిద్రలేమి సమస్య దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.