ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటి ఆక్సిడెంట్లు, ప్రొటీన్, ఫైబర్‌తో నిండిన బాదం.. ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతారు. డైట్లో భాగం చేసుకోవాలని సూచిస్తారు. అయితే, కొందరిలో ఈ బాదం లేనిపోని ఇబ్బందులను తెస్తుందని అంటున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు.. బాదం పప్పు తినకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా, బాదంలో కేలరీలు అధికంగా లభిస్తాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే.. బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
కాబట్టి, బరువు తగ్గాలని అనుకునేవారు వీటిని తక్కువగా తీసుకోవాలి. ఇక బాదంలో మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి, అధిక రక్తపోటు ఉన్నవారు వీటిని ఆచితూచి తినాలి. కిడ్నీ సమస్యతో బాధపడేవారు.. బాదంను పక్కన పెట్టేయాలి. మూత్రపిండాల్లో రాళ్లు.. అందులోనూ క్యాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఉన్నవారు బాదం తీసుకోకపోవడమే మంచిదట. ఎందుకంటే, బాదంలో సహజంగానే ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి.
ఇవి క్యాల్షియంతో కలిసి.. మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతాయి. బాదంతోపాటు ఆక్సలేట్లు అధికంగా ఉండే వేరే గింజలను ఎక్కువగా తినేవారిలో మూత్రపిండాలు దెబ్బతింటాయని పలు సర్వేలు తేల్చాయి కూడా. బాదంలో అధిక మొత్తంలో లభించే పొటాషియం.. శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను ప్రభావితం చేస్తుందట. ఇందులోని ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు.. జీర్ణ సమస్యలు ఉన్నవారిని మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అజీర్ణం, పొట్టలో పుండ్లు, గట్ బ్యాక్టీరియా ఆరోగ్యంగా లేకపోవడం లాంటి సమస్యలు ఉంటే.. బాదం అరగడం కష్టతరం అవుతుంది. దాంతో, సమస్యలు మరింత ముదిరే అవకాశం ఉంటుంది.