ఆ ఊరికి వెళ్తే.. వీధి దీపాల బాగోగులు చూస్తున్న.. విద్యుత్ శాఖా మంత్రి బిజీగా కనిపిస్తారు. బడికి వెళ్తే.. విద్యార్థుల మంచి చెడులు విచారిస్తున్న విద్యాశాఖా మంత్రి ఉంటారు. ఊళ్లో ఎవరూ కట్టుదాటకుండా హోమ్మినస్టర్ కట్టడి చేస్తుంటారు. రైతన్నల అవసరాలు తీర్చడానికి వ్యవసాయ శాఖా మంత్రి సదా సిద్ధంగా ఉంటారు. మంత్రులంతా మకాం వేసిన ఊరు ఎక్కడుందని ఆశ్చర్యపోకండి!
మహాత్మా గాంధీ ఊహించిన గ్రామ స్వరాజ్యానికి చిరునామాగా నిలిచిన గుర్రాలగొంది కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. గ్రామాభివృద్ధి కోసం ఇక్కడ విలేజ్ క్యాబినేట్ ఏర్పాటైంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థిగా బరిలో దిగి, సర్పంచ్‌గా గెలుపొందిన ఆకుల స్వప్న హరీశ్ మంత్రివర్గం ఇది. విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమం అందించడమే లక్ష్యంగా వార్డు మెంబర్లతో ఏర్పాటైన ఈ విలేజ్ క్యాబినెట్ నేడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సమష్టి కృషితో తమ ఊరిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెబుతున్న ఈ మహిళా సర్పంచ్‌ను ‘జిందగీ’ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

మాది సిద్దిపేట దగ్గరున్న పొన్నాల గ్రామం. బి.ఎడ్ పూర్తి చేసిన నేను గుర్రాలగొందికి చెందిన హరీశ్‌ను పెళ్లిచేసుకొని గృహిణిగా స్థిరపడ్డాను. మా ఆయన బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తుండటంతో పెళ్లి తరువాత సిద్దిపేటలోనే కాపురం పెట్టాం. సమాజానికి ఏదైనా చేయాలని మా ఇద్దరికీ ఉండేది. 2018లో సిద్దిపేట నుంచి గుర్రాలగొందికి తిరిగొచ్చాం. ఆ సమయంలోనే సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. ఊరిని బాగు చేయాలనే ఆలోచనతో మా ఆయన సర్పంచ్‌గా పోటీ చేశారు.
దురదృష్టవశాత్తూ ఓడిపోయారు. అయినా ప్రజల మధ్యే ఉండేవారు. వారి కష్టసుఖాలు తెలుసుకునేవారు. సేవా కార్యక్రమాలు చేపడుతూ, స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తుండేవారు. తర్వాత మూడు నెలలకు ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజాసేవలో ఆయన చూపుతున్న అంకితభావానికి అందరూ ముగ్ధులయ్యారు. గుర్రాలగొంది, మల్యాల గ్రామాల ప్రజలంతా కలిసి ఎంపీటీసీగా మావారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఇటీవల విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లో మా గ్రామ సర్పంచ్ పదవి మహిళకు రిజర్వ్ అయింది. దీంతో నన్ను పోటీచేయమని ఆయన సూచించారు. ఐదేండ్లుగా ప్రజల కోసం మావారు చేస్తున్న పనులు దగ్గరుండి గమనించాను. ఆయన స్ఫూర్తితో నాకూ ఊరికి సేవ చేయాలనిపించి ఎన్నికల్లో పోటీ చేయడానికి అంగీకరించాను.

‘ఎన్నికల్లో పోటీ చేయడం వరకే మనవంతు. గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారు. గెలిస్తే పొంగిపోకు, ఓడిపోతే కుంగిపోకు’ అని నామినేషన్ రోజు మావారు చెప్పిన మాటలు నేను ఎన్నటికీ మర్చిపోను. ప్రచారంలో భాగంగా ఊళ్లో ప్రతి గడపనూ తాకాను. గెలవాలనే లక్ష్యంతో బరిలో దిగిన నన్ను మా గ్రామ ప్రజలు 1100 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. గ్రామంలోని పదివార్డుల్లోనూ మా అభ్యర్థులే గెలుపొందడం మరో విశేషం.
సర్పంచ్‌గా పోటీ చేయాలని అనుకున్నప్పటి నుంచీ గెలిస్తే ఊరికి ఏం చేయాలో ఆలోచిస్తూ వచ్చాను. ‘అందరు సర్పంచ్ల్లాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు చేస్తే సరిపోతుంది’ అని కాకుండా నేను గెలవగానే ఎలాంటి పాలన అందించాలో ముందుస్తు ప్రణాళిక తయారు చేసుకున్నా. ఐదేండ్ల పాలనలో మా పాలకవర్గం మార్క్ చూపించాలని నిశ్చయించుకున్నా.

అందుకోసం గతంలో జాతీయస్థాయి అవార్డులను అందుకున్న పలు గ్రామ పంచాయతీల గురించి పరిశోధన చేశాను. అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లి అభివృద్ధి మంత్రమేమిటో తెలుసుకున్నాను. ఆ గ్రామాభివృద్ధిలో గ్రామ కమిటీల పాత్ర చాలా గొప్పది. ఆ గ్రామ స్ఫూర్తితో పుట్టిందే ‘గుర్రాలగొంది గ్రామ మంత్రివర్గం’. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మన మంత్రివర్గం ఏ విధంగా పనిచేస్తుందో అలాంటి తరహా పాలన గ్రామంలో అందించాలనుకున్నా.
గ్రామంలోని విద్య, వైద్యం, పారిశుధ్యం, వీధి దీపాలు, ఇంటి పన్నులు, మహిళా సంఘాల పర్యవేక్షణ ఇవన్నీ చాలా కీలకమైన అంశాలు. గ్రామ సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులకు బాధ్యతలు ఉంటేనే.. వారికీ గౌరవంగా ఉంటుంది, బాధ్యతతో పనిచేస్తారని ఒక్కొక్కరికీ శాఖలను కేటాయించాను. ‘వార్డు సభ్యులుగా గెలిచాం. మన పని మనం చేసుకుందాం. ఏదైనా ఉంటే సర్పంచ్, ఉపసర్పంచ్ చూసుకుంటారులే’ అనే అపోహ నుంచి వాళ్లను దూరం చేసి పది మంది వార్డుసభ్యులతో గ్రామ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించాను. మా పాలకవర్గం తీసుకున్న ఈ నిర్ణయానికి గ్రామస్తులంతా మద్దతిచ్చారు. ఇతర గ్రామాల సర్పంచ్‌లు సైతం ఆ ప్రణాళిక ఎలా చేయాలని అడుగుతుంటే గర్వంగా అనిపిస్తుంది.
శాఖలు కేటాయించిన తరువాత బాధ్యులంతా పనిలో నిమగ్నమయ్యారు. విద్యాశాఖ బాధ్యులు పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనం పరిశీలిస్తారు. వీధి దీపాల శాఖకు చెందిన వాళ్లు.. అందులో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకుంటారు. ఇలా ఒక్కో విభాగాన్ని ఆయా శాఖకు చెందిన బాధ్యులు పర్యవేక్షిస్తుంటారు. అందరం ఒక టీమ్‌గా కలిసి పనిచేస్తున్నాం.

గ్రామ క్యాబినెట్ ఏర్పాటు గురించి తెలుసుకొని, కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టినందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు గారు అభినందించారు. భవిష్యత్తులో కేటాయించిన శాఖలకు న్యాయం చేస్తూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాను. ముఖ్యంగా గ్రామీణ యువతకు చేయూతనిచ్చే కార్యక్రమాలను అమలు చేస్తాను.
గ్రామ సర్పంచ్ అయిన నేను హోమ్, ఫైనాన్స్ బాధ్యతలు స్వీకరించాను. ఉపసర్పంచ్ (నాలుగో వార్డు సభ్యుడు) బెజుగం కృష్ణ ఆరోగ్యశాఖ, ఒకటో వార్డు సభ్యుడు జక్కిరెడ్డి వెంకట్‌రెడ్డి పారిశుధ్య, డంపు షెడ్ నిర్వాహణ శాఖ, రెండో వార్డు సభ్యుడు ఎల్లంలా రాజు రెవెన్యూ శాఖ, మూడో వార్డు మెంబర్ మంద నరేష్.. స్ట్రీట్ లైట్స్, విద్యుత్ శాఖ, ఐదో వార్డు సభ్యురాలు దొంగల స్వాతి స్త్రీ శిశు సంక్షేమ శాఖ (మహిళా సంఘాలు), ఆరో వార్డు సభ్యురాలు సందిరి పుష్పలత తాగునీటి శాఖ, ఏడో వార్డు సభ్యుడు తోకల రాజు ఉపాధి హామీ శాఖ, ఎనిమిదో వార్డు సభ్యురాలు బుర్ర విజయ విద్యాశాఖ, తొమ్మిదో వార్డు సభ్యుడు పిట్ల కిషన్ హౌసింగ్ బోర్డు శాఖ, పదోవార్డు సభ్యురాలు కిష్టని సుజాత వ్యవసాయ శాఖ ఇలా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నాం.
-రాజు పిల్లనగోయిన