నచ్చింది చదవాలనుకున్నది. ఇష్టమైన పనే చేయాలనుకున్నది. మూడునెలలు తిరక్కుండానే మనసు మార్చుకుని కోర్సు మారాలనుకున్నది. ఇంట్లో ఒప్పించి కాలేజీ మారింది. మెకానిక్ ఫీల్డ్‌లో అడుగుపెట్టింది. మూడు నెలల్లో పికప్ అందుకుంది. మ్యాగ్జిమమ్ యాక్సెలరేషన్తో మంచి మార్కులు సాధించడమే
కాదు.. అనుకున్న గమ్యాన్ని ముందే అందుకుంది. మెకానికల్ ఎలక్ట్రిక్ వెహికిల్ (ఐటీఐ) కోర్స్ సర్టిఫికెట్ చేతికి రాకముందే తన కోసం ఓ కారుని తయారు చేసుకుంది స్ఫూర్తి అడపా! తాను సొంతంగా తయారు చేసుకున్న ఈవీ కారులో మణుగూరంతా తిరిగేస్తున్నది. ఇంటికీ, కాలేజీకి అదే కారులో సంతోషంగా సవారీ చేస్తున్న స్ఫూర్తి ‘జిందగీ’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..
మా నాన్న ప్రవీణ్ కుమార్ మెకానిక్. చిన్నప్పటి నుంచి నాన్నతోపాటు మెకానిక్ షెడ్లో చిన్నచిన్న పనులు చేయడం వల్ల ఆ ఫీల్డ్ అంటే ఆసక్తి పెరిగింది. చిన్నప్పటి నుంచి వాహనాలంటే ఇష్టం. నాన్న తన వర్క్‌షాప్‌లో ఫోర్ వీలర్స్ రిపేర్ చేస్తుంటాడు. బైక్, స్కూటీలు కూడా రిపేర్ చేస్తాడు. ఏదైనా కొత్త వెహికిల్ వస్తే.. ‘ఈ రోజు ఓ కొత్త ఇంజిన్ ఉంది. చూద్దువు రా’ అనేవాడు. నాన్నతోపాటు వెళ్లి.. ఇంజిన్ విప్పడం, రిపేర్ చేయడం, బిగించడం అన్నీ చూసేదాన్ని. అప్పుడు ఇది ఫలానా.. ఇలా పని చేస్తుందని చెబుతుండేవాడు. అసెంబుల్ చేసేప్పుడు నేనూ బోల్టులు బిగించేదాన్ని. కొన్నాళ్ల తర్వాత ఇంజిన్లను అసెంబుల్ చేయడం నేర్చుకున్నా. మదర్ బోర్డ్, సౌండ్ సిస్టమ్‌కి సోల్డరింగ్ చేయడం కూడా వచ్చేసింది. ఇంజిన్‌కి చిన్న చిన్న సమస్యలు వస్తే.. రిపేర్ చేసేదాన్ని కూడా! సమ్మర్ హాలిడేస్ వస్తే నాన్నతో, వాహనాలతోనే గడిపేది.
పదో తరగతి పూర్తయ్యాక ఇంటర్లో బైపీసీ తీసుకున్నాను. మూడు నెలల తర్వాత అది బోర్ అనిపించింది. ఎంపీసీ తీసుకుని ఇంజినీరింగ్ చేయాలంటే ఆరేళ్లు పడుతుంది. అంతకాలం చదివినా ఈ ఫీల్డులో నిలదొక్కుకుంటామనే గ్యారెంటీ లేదు. అందరూ చదివేది చదవడం కంటే మనసుకు నచ్చింది చదవాలి, ఇష్టమైన పని చేయాలని అనుకున్నాను. బైపీసీ వదిలేద్దామనుకున్నాను. అప్పుడే మా మణుగూరులో గవర్నమెంట్ వాళ్లు ఏటీసీ (అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్) పెట్టారని తెలిసింది. అందులో మెకానికల్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ కోర్సులో చేరాలనుకున్నాను. ఆ కోర్స్‌లో చేరతానంటే.. ‘మీ నాన్న మెకానికే కదా. మళ్లీ అందులోకి నువ్వెందుకు? బైపీసీ చదివి డాక్టర్ కావాలి’ అని మా అమ్మ అన్నది. నేను మొండికేయడంతో… కాదనలేక ఒప్పుకొన్నది.

ఈ ఫీల్డ్‌లో ఆడవాళ్లు ఎక్కువగా లేరు. మా క్లాస్‌లో ఇరవై రెండు మంది అబ్బాయిలు ఉంటే అమ్మాయిలం ముగ్గురమే! వాళ్లూ నాలాగే ధైర్యంగా మెకానికల్ ఫీల్డ్‌ని ఎంచుకున్నారు. భవిష్యత్‌లో మెకానికల్ ఫీల్డ్కి ఆదరణ ఉంటుంది. మా ఇంట్లో ప్రోత్సాహంతో ఈ కాలేజ్‌లో అడుగుపెట్టాను. ఇక్కడ పాఠాలు బాగా చెప్పేవారు. ఐటీఐ, పాల్టెక్నిక్ కాలేజ్‌లలో లేని యంత్రాలు, టెక్నాలజీ ఇక్కడ ఉంది. కాబట్టి పాఠాల్లో చెప్పినవన్నీ ప్రాక్టికల్‌గా చేసే అవకాశం ఉండేది. ఎలక్ట్రిక్ వెహికిల్‌ని అసెంబుల్, డిసెంబుల్ చేయడం పూర్తిగా నేర్పించారు. గేర్ బాక్స్, స్టీరింగ్ సిస్టమ్, సస్పెన్షన్స్, పవర్ స్టోరేజ్ గురించి పాఠాలు చెప్పేవాళ్లు. మంచి ల్యాబ్ ఉండటం వల్ల అవి మాకు చక్కగా అర్థమయ్యేవి. కంప్యూటర్ న్యూమరిక్ కటింగ్, లేజర్ కటింగ్ మెషిన్లు కూడా మా కాలేజీలో ఉన్నాయి. క్యాడ్, క్యాడ్కెన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి కొత్త వాహనం తయారీ కోసం వర్చువల్ డిజైనింగ్ చేయడం కూడా నేర్పించారు. ఏవైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే నాన్నని అడిగి తెలుసుకునేది. ఆడపిల్లలకు మెకానికల్ ఫీల్డ్ అర్థం కాదనేది అబద్ధం. ఇంట్లో సపోర్ట్, కాలేజ్‌లో ప్రోత్సాహం ఉంటే ఆడపిల్లలకు అంతుచిక్కని విషయం ఉండదు!
మణుగూరులో మా ఇంటికి నేను చదివే ఏటీసీకి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంది. నన్ను కాలేజీకి నాన్న బైక్ మీద దింపేది. మళ్లీ సాయంత్రం వచ్చి పికప్ చేసుకునేది. తనకు పని ఉంటే నేను చిన్నగా ఆటోలోనో, బస్‌లోనో వెళ్లేది. ఎలాగూ మెకానికల్ ఎలక్ట్రిక్ వెహికల్ కోర్స్ చేస్తున్నాను. కాబట్టి నా కోసం ఓ కారు తయారు చేసుకుందాం అనిపించింది. మోటార్, టైర్లు, సస్పెన్షన్లు, ఇతర విడిభాగాలు కొన్నాను. ఓ డిజైన్ తయారు చేసి పని మొదలుపెట్టాను. ‘ఇంత రిస్క్ అవసరమా?’ అని నాన్న అన్నా సరే ఆపలేదు. నాన్న సాయం తీసుకుంటూ, బానోత్ అశోక్ నాయక్ సార్ సలహాలు పాటిస్తూ కారు తయారీకి పూనుకున్నాను. ఈ ఎలక్ట్రిక్ కారు రెండు నెలల్లో కారు తయారైంది. నాలుగు నెలలు గడిచింది. ఈ కాలంలో మాకూ ఒక కారు చేసిపెట్టవా అని ఎంతోమంది అడిగారు. మా పిల్లల కోసం వెహికిల్ తయారు చేయమని చాలామంది పేరెంట్స్ రిక్వెస్ట్ చేశారు. ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నేను తయారు చేసిన కారు గురించి తెలుసుకుని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేందర్ గారు అభినందించారు.

పట్టణంలో ఉండే నాకే కాలేజీకి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. ఇక అటవీ ప్రాంతాల్లో ఉండే ఆదివాసీలకు ఇంకెన్ని సమస్యలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వాళ్ల కోసం ఇలాంటి వాహనాలను ఎక్కువ మొత్తంలో తీసుకువస్తాను. ఈ కారు తయారు చేయడానికి ఓ నలభై వేల రూపాయలు ఖర్చు అయింది. పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తే ఖర్చు తక్కువే అవుతుంది. ఒక తయారీ కంపెనీ పెట్టి, గ్రామీణ, అటవీ ప్రాంతాల ప్రజల అవసరాలు తీర్చేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తాను. ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసి తక్కువ ధరకు అమ్మాలన్నదే నా లక్ష్యం.
ఈ కారు కోసం కొన్న విడిభాగాల ఖరీదు నలభై వేలు. 750 వాట్స్ మోటార్, తక్కువ ఖర్చు కోసం 12 వోల్టుల లెడ్ యాసిడ్ బ్యాటరీలను నాలుగింటిని కలిపి అమర్చింది. మొత్తం బ్యాటరీ కెపాసిటీ 140 ఆంఫియర్లు. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే (గంటకు 30 కిలోమీటర్ల వేగంతో) 40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈ కారు బరువు 400 కేజీలు. ఇందులో ఇద్దరు కూర్చుని ప్రయాణించే వెసులుబాటు ఉంది. అప్పుడప్పుడూ ఈ కారుతో ట్రయల్స్ వేస్తుంటే వీధిలోవాళ్లంతా ‘ఔరా!’ అని ఆశ్చర్యపోతున్నారు! మాకూ ఒకటి చేసిపెట్టమని అడ్వాన్స్‌గా ఆర్డర్లు ఇస్తున్నారు, అభినందనలు చెబుతున్నారు!
– నాగవర్ధన్ రాయల