ఉపగ్రహాలు తయారు చేసేలా చిట్టి మెదళ్లకు పదును

‘అమ్మా! ఈ ఆకాశం ఎక్కడి వరకుంది?’
‘చుక్కలెందుకు మెరుస్తాయి? తెల్లారగానే కనిపించవెందుకు?’
‘మబ్బులు దాటుకుంటూ చందమామ ఎక్కడికి వెళ్తున్నాడు?’
ఆరుబయట మంచం మీద పడుకొని చుక్కలు లెక్కిస్తూ.. చెంతనే ఉన్న అమ్మపై ప్రశ్నల వర్షం కురిపించింది అమృత. ‘నువ్వు బాగా చదువుకుంటే, వీటన్నిటి గురించీ నువ్వే తెలుసుకోవచ్చు సరేనా!’ అంటూ ఆ తల్లి చెబుతుండగానే.. ఓ చుక్క నింగిని చేరుకుంటున్న దృశ్యం అమృత కండ్లలో పడింది. ‘అమ్మా అటు చూడు..?’ అంటూ తల్లికి చూపించింది. ‘అది తోక చుక్క. దాని జీవితకాలం అయిపోయింది. అందుకే నేలపై పడిపోయింది’ అని తనకు తెలిసిన కథ చెప్పసాగింది. ఊకొడుతుందన్న మాటే కానీ, అమృత ఆలోచనలన్నీ నక్షత్రాల చుట్టే తిరుగుతున్నాయి. ఈ అద్భుతాల వెనుక ఏదో రహస్యం దాగుందనిపించింది. పెద్దయ్యాక అంతరిక్షంలోకి వెళ్లి అవన్నీ ఛేదించాలనే దృఢసంకల్పం చేసుకొని నిద్రలోకి జారుకుంది.
తెల్లారింది. అమృత స్కూల్ యూనిఫాం ధరించి బడికి బయల్దేరింది. తను ఎనిమిదో తరగతి చదువుతున్నది. నిరుపేద కుటుంబం. విశ్వంలో ఏముందో తెలుసుకోవాలన్న అమృత ఆలోచనలకు రెక్కలు ఎవరు తొడగాలి? ఆ కోరిక తీరాలంటే ఎంత పెద్ద చదువులు చదవాలి? ఎన్ని లక్షలు ఖర్చుపెట్టాలి? అమృతలాంటి పేద విద్యార్థుల కలలు సాకారమవ్వడం సాధ్యమేనా? ‘అవును, సాధ్యమే’ అంటున్నారు డాక్టర్ శ్రీమతి కేశన్. ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’ ఫౌండేషన్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఇంపాజిబుల్ అయిన కలను ‘మిషన్ పాజిబుల్' ద్వారా నిజం చేస్తున్నారీ హైదరాబాదీ మహిళ.
చెన్నై విమానాశ్రయం..
ఏప్రిల్ 27, 2010. ఉదయం 5 గంటలు. తలకు నూనె బాగా పట్టించి, రెండు జడలు వేసుకొని, రిబ్బన్లు కట్టుకొని, భుజానికి బ్యాగు, అందులో మూడు జతల దుస్తులతో ఎయిర్‌పోర్టుకు వచ్చింది పన్నెండేండ్ల అమృత. ముడతలు పడ్డ స్కూల్ యూనిఫామ్‌ను సరిచేసి, అమృతను విమానాశ్రయం లోపలికి పంపి.. అద్దాలలో నుంచి ఆదుర్దాగా చూస్తూ నిల్చొని ఉండిపోయింది వాళ్లమ్మ. అమృత వెనకాలే మరో పద్నాలుగేండ్ల విద్యార్థి గోపీనాథ్, అతనితో పాటే వినయ్ భరద్వాజ్, ఆ వెనుక పదోతరగతి చదువుతున్న విజయ, కావ్య, శ్రీజ.. ఇలా సుమారు 108 మంది విద్యార్థులు విమానయానానికి వెళ్తున్నారు. అమెరికా దాకా వెళ్తున్నారు. విశ్వాన్వేషణకు కేంద్రమైన.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ను సందర్శించనున్నారు. అందరూ పేద విద్యార్థులే! వీరందరి కలను నిజం చేశారు డాక్టర్ కేశన్. ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’ ద్వారా ఈ చిన్నారులను శాస్త్ర, సాంకేతిక సామ్రాజ్యంలో విహరింపజేశారు.
పదకొండేండ్ల కిందట..
2009లో అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రెండు రోజుల స్పేస్ మీట్‌కు ఇండియా తరఫున వెళ్లారు కేశన్. పదివేల మంది అంతర్జాతీయ ప్రతినిధులు వచ్చారు. 3,600 సైన్స్ కేంద్రాలున్నాయి. నాసా విభాగాన్ని సందర్శించినప్పుడు అక్కడ ‘పిల్లల కోసం స్పేస్ క్యాంప్' అనే ప్రకటన చూశారామె. ఆ సమావేశంలో ఒక్క భారతీయ యువ సైంటిస్టూ లేకపోవడం గమనించారు. మన దేశంలో సాంకేతికత అభివృద్ధి చెందుతున్నా, విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన కల్పించే అవకాశాలు లేవని కలత చెందారు. ఈ దిశగా తానెందుకు ప్రయత్నించకూడదని నిశ్చయించుకున్నారు. అలా 2010లో ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’ (ఎస్కెఐ) సంస్థను ప్రారంభించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ జిజ్ఞాసను పెంచి, ఈ రంగంలో వారికి ఊతం ఇవ్వాలని బలంగా అనుకున్నారు.
తొలిసారి108 మందితో..
నాటి నుంచి అంతరిక్ష ప్రయోగాలు, ఖగోళ అద్భుతాల గురించిన జ్ఞానాన్ని విద్యార్థులకు పంచడమే లక్ష్యంగా పని చేశారు కేశన్. మరో అడుగు ముందుకేసి ‘సైన్స్ మీద ఆసక్తి ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులను ‘నాసా’కు తీసుకెళ్తామ’ని ప్రకటించారు. ఇందు కోసం నాసా నుంచి అనుమతి తీసుకున్నారు. ప్రయాణ ఖర్చులు విద్యార్థుల తల్లిదండ్రులే భరించాల్సి ఉండటంతో ఎవరూ స్పందించలేదు. నవ్వినవాళ్లూ ఉన్నారు. మూడు నెలల తర్వాత ఓ అప్లికేషన్ వచ్చింది. ‘పదో తరగతి చదువుతున్న మా కూతురిని నాసాకు పంపిస్తారా’ అని ఓ తండ్రి కోరారు. వారం తర్వాత ఓ విద్యాసంస్థ తమ పాఠశాలలో చదువుతున్న ఏడుగురు విద్యార్థులను నాసాకు పంపడానికి ముందుకొచ్చింది. రెండు నెలల తర్వాత స్పాన్సర్ల సాయంతో అమృతలాంటి 108 మంది విద్యార్థులను నాసాకు తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నారు కేశన్.
పిల్లల ప్రయోగశాల
ఆ పర్యటన కేశన్కు ఓ అచీవ్మెంట్. అది విజయవంతం అవ్వడంతో ‘స్పేస్ కిడ్జ్'ను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాకెట్లు, శాటిలైట్ల గురించి, దేశాభివృద్ధిలో సైన్స్ పాత్ర గురించి అధ్యయనం మొదలు పెట్టారు. నాసా ప్రయాణం ఇచ్చిన ప్రేరణతో యూరప్, రష్యా స్పేస్ సెంటర్లకు కూడా వేలల్లో విద్యార్థులను తీసుకెళ్లారు. అంతేకాదు, ఆ చిట్టి మెదళ్లకు పదునుపెట్టి వారితో ఉపగ్రహాలను తయారు చేయిస్తున్నారు. ఇప్పటి వరకు 12 బెలూన్ సాట్స్, 2 సబ్ ఆర్బిటల్ ఉపగ్రహాలు, ఒక ఆర్బిటల్ ఉపగ్రహాన్ని రూపొందించిన ఏకైక భారతీయ సంస్థగా ‘స్పేస్ కిడ్జ్' పేరు సాధించింది. 16 నుంచి 21 ఏండ్ల విద్యార్థులతో కలామ్సాట్-నాసా (అత్యంత తేలికైన త్రీడి ముద్రిత ఉపగ్రహం), కలామ్సాట్ వీ2-ఇస్రో (PSLV 4వ దశలో ప్రయాణించడానికి తేలికైన విద్యార్థి ఉపగహం)లను విజయంవంతగా అంతరిక్షంలోకి పంపింది. ఇలా తమ సంస్థ చేపట్టే ప్రతి పరిశోధనలోనూ విద్యార్థులను భాగస్వాములను చేస్తూ వారి అడుగులు అంతరిక్షం వైపు సాగేందుకు కృషి చేస్తున్నారు కేశన్.
ఈసారి 1500 మంది
ఏటా ఎస్కేఐ వెబ్సైట్లో అంతరిక్ష కేంద్రాల పర్యటన వివరాలు పొందుపరుస్తారు. అంతరిక్షం, రాకెట్ సైన్స్ అంశాలపై ‘యంగ్ సైంటిస్ట్' పేరుతో పోటీలను నిర్వహిస్తారు. దీని ద్వారా పర్యటనకు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 12-22 సంవత్సరాల వయసున్న 1,500 మంది విద్యార్థులను ఖగోళ అధ్యయనాల కోసం విదేశాలకు తీసుకెళ్లారు కేశన్. అమెరికా, కెనడా, రష్యా తదితర దేశాల్లోని అంతరిక్ష కేంద్రాలకు ఆమె రాయబారి. రష్యాలో జరిగే ‘మాక్స్-ఏరో ఫెస్టివల్'కు కూడా అంబాసిడర్.
మన హైదరాబాదీ
పిల్లల మనసులో సైన్స్ పట్ల అభిరుచి కలిగిస్తున్న కేశన్ పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. ఆమె తల్లిదండ్రులు మీన, శ్రీనివాసన్. చిన్నప్పటి నుంచి కేశన్కు క్రీడలంటే ఆసక్తి. ఎన్సీసీ ఈవెంట్లలో చురుగ్గా పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరఫున పదేండ్లు బాస్కెట్‌బాల్‌లో నేషనల్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. పెండ్లయిన తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు.
ఆప్రయోగం వెనుక
శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 28న ఉదయం 10.24 గంటలకు ఓ ప్రయోగం జరగనుంది. ఇస్రో చరిత్రలోనే తొలిసారిగా దేశీయ ప్రైవేట్ సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. ఈ ఉపగ్రహాల్లో ఒకటి.. భగవద్గీత ప్రతి, ప్రధాని మోదీ చిత్రంతోపాటు 25వేల మంది పౌరుల పేర్లతో కూడిన జాబితాను గగనాంతర రోదసిలోకి తీసుకెళ్లనుంది. ఆ ఉపగ్రహం కేశన్ నేతృత్వంలోని స్పేస్ కిడ్స్ తయారు చేసిందే కావడం విశేషం. ఈ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష శాస్త్రవేత్త సతీశ్ ధావన్ పేరు మీదుగా రూపొందించారు. తమ ప్రత్యేకతను చాటుకోవడానికి ఈ తరహా ప్రయోగానికి సిద్ధపడ్డామని అంటారు కేశన్. ఉపగ్రహంలో పొందుపరిచిన 25వేల మంది విద్యార్థుల పేర్లలో వెయ్యి విదేశీయులవి కాగా, మిగిలినవన్నీ చెన్నైకి చెందిన విద్యార్థులవే.
తాజావార్తలు
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
- పెండ్లి చేసుకుందామంటూ మోసం.. మహిళ అరెస్ట్
- ‘సారస్వత’ పురస్కారాలకు 10 వరకు గడువు