కరుణామయి.. అరుణకుమారి

ఎవరైనా సరే, ఆస్తిపాస్తులకు వారసులమంటారు. సిరిసంపదల కోసం ఉత్సాహంగా ముందుకొస్తారు. అరుణ మాత్రం తన పెద్దల సేవాగుణాన్ని పుణికి పుచ్చుకున్నారు. ఏరికోరి ఏఎన్ఎంగా విధుల్లో చేరారు. ఇరవై రెండేండ్లుగా మురికివాడల్లోని పేదలకు అండగా ఉంటున్నారు. తాజాగా, ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారానికి కూడా ఎంపికయ్యారు. హైదరాబాద్ అఫ్జల్‌సాగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న అనపర్తి అరుణ కుమారి ప్రయాణం..
అరుణ కుమారిది మధ్యతరగతి కుటుంబం. పుట్టిపెరిగినదంతా హైదరాబాద్‌లోనే. అమ్మమ్మ మిన్నమ్మతోపాటు అమ్మ, అత్తమ్మలు, అక్కలు, చెల్లెళ్లు.. అంతా నర్సులుగా సేవలు అందించారు. వారి మధ్య పెరగడంతో అరుణకుమారిలోనూ సేవాభావం చిగురించింది. తనూ నర్సింగ్ వృత్తిలో స్థిరపడాలని నిర్ణయించుకొంది. మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు పూర్తయిన తర్వాత, గుడిమల్కాపూర్ యూపీహెచ్‌సీలో ఏఎన్ఎంగా చేరారు. అక్కడి వైద్యురాలు డాక్టర్ అనూరాధ స్ఫూర్తితో మరింత నైపుణ్యాన్ని సాధించారు. ప్రస్తుతం అఫ్జల్‌సాగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
పేదల మధ్యే..
అరుణకుమారి కెరీర్లో ఎక్కువ భాగం మురికివాడల్లోనే గడిచింది. అప్పట్లో పరిస్థితి దారుణంగా ఉండేది. 104, 108 వాహనాలూ లేవు. అయినా ఓపికతో పనులు చేశారు. తనే రోగులను దవాఖాన వరకూ తీసుకెళ్లేవారు. మురికివాడల్లో చాలామంది దినసరి కూలీలే. అంతటి పేదరికంలోనూ, సర్కారు దవాఖానకు వచ్చేందుకు ఆసక్తి చూపేవారు కాదు. ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా కార్మికులు పని మానుకోరు. పనికి వెళ్లకపోతే సంపాదన ఉండదు. పూట గడవదు. ఆరునూరైనా తెల్లవారుజామున బయల్దేరాల్సిందే. వారికి ఎలాగైనా వైద్యసేవలు అందించాలనే నిశ్చయంతో ఉదయం 6 గంటల లోపే ఆయా బస్తీలకు చేరుకొనేవారు. ఆదివారం ఇంటివద్దనే ఉంటారు కాబట్టి, ఆ రోజు తనకు వారాంతపు సెలవు అయినా సరే విధులను నిర్వర్తించేవారు. అవసరమైతే, మరుసటి రోజు విశ్రాంతి తీసుకునేవారు. ఏ పేదింటి మహిళకైనా కాన్పులు కష్టమైతే.. రాత్రిళ్లు అక్కడే ఉండిపోతారు. ప్రసవం తరువాత పండంటి బిడ్డను చేతిలో పెట్టాకే ఇంటికి వస్తారు. హైదరాబాద్ వరదల సమయంలో గోల్కొండ, టోలీచౌకి నదీం కాలనీ తదితర ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలోనూ ఆమె బాధ్యతలను మరువలేదు. ఆ ప్రవాహానికి ఎదురెళ్లారు.
వ్యక్తిగత జీవితంలో
అరుణకుమారి వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో సవాళ్లు. చిన్న వయస్సులోనే భర్త గుండెపోటుతో కన్నుమూశారు. ఒంటరిగా కుటుంబ భారాన్ని మోస్తూ, పిల్లల ఆలనాపాలనా చూసుకున్నారు. పెద్ద కుమార్తె స్రవంతి బీఎస్సీ కంప్యూటర్స్ చేసింది. చిన్న కూతురు ప్రవంతి నిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్ పాసై తల్లి బాటలోనే నడుస్తున్నది. ‘ఈ పురస్కారం నా బాధ్యతను పెంచింది. మరింత అంకితభావంతో సేవలను అందించేందుకు నాలో ఉత్సాహాన్ని నింపింది’
అని అంటారామె.
తాజావార్తలు
- రియల్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీవో
- కొత్త కారు కొంటున్న జూనియర్ ఎన్టీఆర్.. ధరెంతో తెలుసా?
- ఒకే ప్రాంతం..ఒకే రోజు.. 100 సఫారీలు డెలివరీ
- శివసేన నేతలతో ప్రాణ హాని : సుప్రీంకోర్టులో బాలీవుడ్ క్వీన్ పిటిషన్
- బరువు తగ్గాలా.. పచ్చి బఠానీ తినండి
- ఆ నగరంలో మాంసం.. గుడ్లు నిషేధం!..
- నేను ఐటెంగాళ్ ను కాదు: అనసూయ
- ప్రైవేటు రంగంలో స్థానిక రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం
- కొవిడ్-19 సర్టిఫికెట్‌పై ప్రధాని ఫోటో ప్రచార ఎత్తుగడే : తృణమూల్ కాంగ్రెస్
- ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు