శనివారం 23 జనవరి 2021
Zindagi - Dec 03, 2020 , 00:04:35

ఆవిష్కరణల మేఘన

ఆవిష్కరణల మేఘన

మనిషి అవసరమే నూతన ఆవిష్కరణకు దారి చూపుతుంది. ఆ ఆవిష్కరణే మానవ జీవితానికి దశ, దిశ నిర్దేశిస్తుంది.ఒక్కోసారి చరిత్ర గతినే మార్చేస్తుంది. ప్రపంచ ఆవిష్కరణల్లో తనకంటూ ఓ పేజీ ఉండాలని ఆ యువతి కలలుగన్నది. అందుకోసం వైద్యవృత్తిని కూడా వదులుకొని, శాస్త్రవేత్త అవతారం ఎత్తింది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన‘టీ హబ్‌'లో ‘ది ఫీ ఫ్యాక్టరీ’కి అంకురార్పణ చేసింది. సరికొత్త ఆలోచనలకు ‘ఎకనమిక్‌ టైమ్స్‌ ఇన్నొవేషన్‌ అవార్డు’ను  కూడా అందుకున్నది డాక్టర్‌ జాలె మేఘనారెడ్డి.

డాక్టర్‌ జాలె మేఘనా రెడ్డి పుట్టి పెరిగిందంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో. తండ్రి జాలె రాజశేఖర్‌ రెడ్డి, మణుగూరులోని ‘భారజల కర్మాగారం’లో పనిచేసేవారు. తల్లి సునీత గృహిణి. చదువులో ఎప్పుడూ ముందుండే మేఘన, అశ్వాపురంలోని ఆటమిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్‌లో పదో తరగతి దాకా చదివారు. అణుశక్తి విభాగం పరిధిలోని బడి కావడంతో సైన్స్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. దీంతో చిన్నప్పటి నుంచే శాస్త్ర విజ్ఞానంపై మక్కువ పెంచుకున్నారు. బాల్యమంతా శాస్త్రవేత్తల మధ్యే గడపటంతో,  ఏ విషయాన్ని అయినా సాంకేతిక కోణంలో ఆలోచించడం అలవర్చుకున్నారు. ఇంటర్‌ తర్వాత ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి, హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్‌ కాలేజ్‌లో సీటు సాధించారు. మెడిసిన్‌ చదువుతున్నా, ధ్యాసంతా శాస్త్ర సాంకేతికతపైనే ఉండేది. 

మెడిసిన్‌ చదువుతూనే..

మెడిసిన్‌ రెండో సంవత్సరంలో ఉండగానే ఆవిష్కరణలవైపు అడుగులేశారు మేఘన. మామూలుగా వెన్నెముక అరిగిపోతే ‘బోన్‌ సిమెంట్‌' ద్వారా వైద్యం అందిస్తారు. చికిత్సలో ఏ కొంచెం తేడా వచ్చినా, రోగికి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ తీవ్రతను తగ్గించేందుకు ‘ఆర్థోపెడిక్‌ ప్రాజెక్ట్‌'పై రిసెర్చ్‌ మొదలుపెట్టారు. అప్పుడే ‘ఫొటో పాలిమర్‌'పై పీహెచ్‌డీ చేస్తున్న ప్రవీణ్‌ గోరకవి పరిచయమయ్యారు. ఇద్దరూ కలిసి, ఆర్థోపెడిక్‌ సర్జరీల్లో రిస్క్‌ ఫ్యాక్టర్‌ను తగ్గించే ‘ఫొటో పాలిమర్‌ టెక్నిక్‌'ను కనిపెట్టారు. ఇద్దరూ విద్యార్థులే కావడంతో ఈ ఆవిష్కరణను మార్కెట్లోకి తీసుకురాలేకపోయారు. ఆ బాధ్యత ఒక ఇటాలియన్‌ సంస్థకు అప్పగించారు. తర్వాత వీరి దృష్టి దివ్యాంగుల అవసరాలపై పడింది. ప్రస్తుతం అంధులు ఉపయోగిస్తున్న ‘బ్రెయిలీ టైప్‌

రైటర్‌' వెనక ఉన్న సాంకేతికత 60 ఏండ్ల నాటిది. ధర ఎక్కువ. బరువూ ఎక్కువే. దీంతో పేద, మధ్యతరగతి అంధ విద్యార్థులు ఉపయోగించడం కష్టంగా మారింది. దీనికి పరిష్కారంగా ‘కిలిమంజారో బ్లైండ్‌ ట్రస్ట్‌'తో కలిసి ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు, చాలా తేలికైన 

‘మెకానికల్‌ బ్రెయిలీ టైప్‌ రైటర్‌'ను రూపొందించారు. తర్వాత చవకైన సీటీ స్కాన్‌ యంత్రానికి రూపకల్పన చేశారు. దాని సాంకేతిక పరిజ్ఞానాన్ని మరో సంస్థకు అప్పగించారు. 

‘ఫ్రీలాన్సర్‌'గా అడుగులు

మేఘన మొదట్లో ఫ్రీలాన్స్‌ సైంటిస్ట్‌గా పనిచేశారు. ఒక ఆవిష్కరణ చేయడం, దానిని ఏదో ఓ సంస్థకు అప్పగించడమే తన పని. ఎందుకంటే, ఏదైనా ఆవిష్కరణను మార్కెట్లోకి తీసుకురావడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. భారీ పెట్టుబడులతోపాటు క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడం, లైసెన్స్‌ పొందడం, ఆపై మార్కెటింగ్‌ చేయడం.. వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. దీంతో తమ ఆవిష్కరణలపై హక్కులను పలు సంస్థలకు అప్పగించారు. అయితే, ఇక్కడా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. హక్కులు తీసుకున్న సంస్థలు, వాటిని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు చాలా సమయం తీసుకునేవి. ఇంకొన్ని సంస్థలైతే, డిమాండ్‌ పెరిగినప్పుడు చూద్దామంటూ ప్రాజెక్టును పక్కన పెట్టేసేవి. కానీ, అవసరం ఉన్నవారికి అందుబాటులోకి వచ్చినప్పుడే ఏ ఆవిష్కరణకు అయినా విలువ. 

‘టీ హబ్‌'లో ‘ది ఫీ ఫ్యాక్టరీ’  

వ్యాపార దృక్పథంతో ఆలోచించే సంస్థల వల్ల, తమ ఆవిష్కరణలు సకాలంలో బయటకు రాకపోవడంతో మేఘన కలత చెందారు. దీంతో తమ సాంకేతికతను విదేశాల్లోని పెద్ద సంస్థలకు అప్పగించడం కంటే స్వదేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఇవ్వడం మంచిదనే నిర్ణయానికి వచ్చారు. దీనివల్ల స్థానికంగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. దేశంలోని చిన్న కంపెనీలకు శాస్త్ర సాంకేతికతను అందించడానికి 2018లో ప్రవీణ్‌ గోరకవితో కలిసి ‘ది ఫీ ఫ్యాక్టరీ’కి అంకురార్పణ చేశారు మేఘనా రెడ్డి. ఈ సంస్థద్వారా అనేక ఆవిష్కరణలు చేస్తూ, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. మొదటి త్రైమాసికం నుంచే సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్నారు. రెండేండ్లలోనే సంస్థ నెట్‌వర్క్‌ను 18 రాష్ర్టాలకు విస్తరించారు. ఇటీవలే ప్రతిష్ఠాత్మక ‘ఎకనమిక్‌ టైమ్స్‌ ఇన్నొవేషన్‌ అవార్డు’నూ అందుకున్నారు. 

అదే లక్ష్యం..

పర్యావరణహితంగా పలు ఆవిష్కరణలు చేసిన మేఘన, భవిష్యత్‌లో ‘బయో ప్లాస్టిక్‌'ను రూపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ‘ప్లాస్టిక్‌ వ్యర్థాలు’ ఒకటి. దీనిని నివారించేలా కేవలం 28 రోజుల్లో భూమిలో కలిసిపోయేలా ‘బయో ప్లాస్టిక్‌'ను తయారు చేసేందుకు ప్రయోగాలు ప్రారంభించారు. ఫార్మా ఉత్పత్తుల్లో హైదరాబాద్‌ అగ్రగామిగా ఉన్నది. అయితే, పలు సంస్థలు ఔషధాల తయారీకి కావాల్సిన ముడిపదార్థాలను  చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. దీనికి చెక్‌ పెట్టేలా ఫార్మారంగంలోనూ నూతన సాంకేతికతను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. తాగునీటి సరస్సుల్లో కాలుష్యాన్ని నివారించేలా ప్రత్యేక ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు.

లాభాలు ముఖ్యం 

కాదుచిన్నప్పటి నుంచీ శాస్త్రవేత్తల మధ్యే తిరిగాను. మెడిసిన్‌లో ఉండగా ఎప్పుడు పుస్తకాలు పట్టుకున్నా, అందులోని ప్రతి అక్షరం ఒక శాస్త్రవేత్త ఆవిష్కరణే కదా అనిపించేది. ఒక్కో పుస్తకం వెనుక ఎంతోమంది శాస్త్రవేత్తల కృషి దాగి ఉంది కదా అనుకునేదాన్ని. అందుకోసమే వైద్యవృత్తిని కాదని, ఈవైపు అడుగులు వేశా. ప్రవీణ్‌ గోరకవితో కలిసి అనేక ఆవిష్కరణలు చేశా. మాకు లాభాలు ముఖ్యం కాదు. ఆవిష్కరణలు పదిమందికి ఉపయోగపడాలన్నదే మా అభిలాష. ‘బ్రెయిలీ టైప్‌ 

రైటర్‌' టెక్నాలజీని ఏదైనా పెద్ద సంస్థకు ఇస్తే, మా సంస్థకు భారీ ఆదాయం వచ్చేది. కానీ, వాళ్లు  టైప్‌ రైటర్లను మరింత ఎక్కువ ధరకు అమ్మేవారు. అప్పుడు మా ఆశయం నెరవేరేది కాదు. అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ‘చారిటీ ట్రస్ట్‌'కు ఆ టెక్నాలజీని అప్పగించాం. ‘జీఎఫ్‌పీ’ సాంకేతికత ద్వారా ఇప్పటికే 7,500 భారీ వృక్షాలను కాపాడగలిగాం. ఇది ఒక మినీ ఫారెస్ట్‌కు సమానం. భవిష్యత్‌లోనూ వైద్యరంగంతోపాటు పర్యావరణాన్ని కాపాడే ఆవిష్కరణలు చేస్తాం. 

- డాక్టర్‌ జాలె మేఘనా రెడ్డి, సీయీవో, ది ఫీ ఫ్యాక్టరీ

పర్యావరణహితం ‘జీఎఫ్‌పీ’

కాగితపు పరిశ్రమను కాలుష్యరహితంగా మార్చడమే లక్ష్యంగా ‘జీఎఫ్‌పీ’ టెక్నాలజీని రూపొందించారు మేఘన. సాధారణంగా ఒక టన్ను క్రాఫ్ట్‌ పేపర్‌ తయారీ కోసం 17 భారీ వృక్షాలను నరికేయాల్సి ఉంటుంది. దీని వల్ల పర్యావరణానికి తీరని నష్టం. ఆ తీవ్రతను తగ్గించేందుకు ‘ది ఫీ ఫ్యాక్టరీ’ ఆధ్వర్యంలో ‘జీఎఫ్‌పీ’ సాంకేతికతను తీసుకొచ్చారు మేఘన. ఈ టెక్నాలజీ ద్వారా క్రాఫ్ట్‌ పేపర్‌ ఉత్పత్తిలో చెట్ల వినియోగం తగ్గుతుంది. ఒక టన్ను పేపర్‌ తయారీకి 14 వృక్షాలే సరిపోతాయి. అలా ‘ది ఫీ ఫ్యాక్టరీ’ ద్వారా ఇప్పటి వరకూ 2,500 మెట్రిక్‌ టన్నుల క్రాఫ్ట్‌ పేపర్‌ను వాడుకలోకి తీసుకొచ్చారు. అంటే, దాదాపు 7,500 భారీ వృక్షాలను కాపాడగలిగారు. 

సాచెట్స్‌లో శానిటైజర్‌

కొవిడ్‌ నేపథ్యంలో ‘శానిటైజర్‌' తప్పనిసరి అయిపోయింది. అయితే, పెద్ద సంస్థలు తయారు చేస్తున్న ఆల్కహాలిక్‌ శానిటైజర్లు మారుమూల ప్రాంతాలవారికి ఇప్పటికీ చేరడం లేదు. ధరకూడా ఎక్కువ. తక్కువ ధరలో లభించే కొన్ని రకాల శానిటైజర్లతో చర్మ సంబంధ సమస్యలు వస్తున్నట్లు మేఘన గుర్తించారు. దీనికి పరిష్కారంగా శానిటైజర్‌ను సాచెట్స్‌ రూపంలోకి తీసుకొచ్చారు. 


logo