శుక్రవారం 23 అక్టోబర్ 2020
Zindagi - Oct 18, 2020 , 00:23:13

మిణుగురులు తెచ్చిన అవార్డు

మిణుగురులు తెచ్చిన అవార్డు

అప్పుడు ఐశ్వర్య శ్రీధర్‌కు 12 ఏండ్లు! మహారాష్ట్రలోని తీర ప్రాంత పట్టణం ఉరన్‌లో ఉండేవాళ్లు. ఓ రోజు ఆఫీస్‌ నుంచి వస్తూ శ్రీధర్‌ రంగనాథన్‌ కూతురికి బహుమతిగా కెమెరా తీసుకొచ్చాడు. దాన్ని చేతుల్లోకి తీసుకొని బహుమతి తెచ్చిన తండ్రి ఫొటో తీయలేదు. పచ్చని చెట్టును క్లిక్‌ మనిపించి. తన అభిలాష ఏమిటో చెప్పకనే చెప్పిందా రోజు. అప్పటి నుంచి కనిపించిన ప్రతి చెట్టునూ, పుట్టనూ, పిట్టనూ వదలకుండా ఫొటోలు తీయడం అలవాటుగా చేసుకుంది. అందంగా తీయడం నేర్చుకుంది. ఆశ్చర్యపోయేలా తీసేంత వరకూ వెళ్లింది. ఎంతలా అంటే.. లండన్‌లోని నేషనల్‌ హిస్టరీ మ్యూజియం నుంచి ‘వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌' పురస్కారం అందుకునేంతలా! ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ యువతి ఐశ్వర్యే!

ఐశ్వర్య తండ్రి శ్రీధర్‌ కూతురు అడక్కపోయినా ‘కాకులు దూరని కారడవి..’ అని బోలెడన్ని కథలు చెబుతుండే వాడు. అలా బాల్యంలోనే పర్యావరణంతో ప్రేమలో పడింది ఐశ్వర్య. అందుకే తండ్రి కొనిచ్చిన కెమెరాలో మనుషుల కన్నా మానుల ఫొటోలే ఎక్కువగా ఉండేవి. కూతురు ఆసక్తిని గమనించిన శ్రీధర్‌ ఆమెను మరింత ప్రోత్సహించాడు. సెలవులు వస్తే చాలు జంతులోకంలోకి తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో ఫొటోగ్రఫీపై ప్రేమతో పాటు పచ్చదనంపై గౌరవం పెంచుకుంది ఐశ్వర్య. పర్యావరణ ప్రేమికుల సంఘంలో చేరి చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా పాటుపడుతున్నది.

14 ఏండ్లప్పుడు అవార్డు

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసు అధికారి కాగలిగితే జీవితమంతా అడవితల్లి ఒడిలోనే ఉండొచ్చని ఆశపడింది ఐశ్వర్య. కానీ, కెమెరా కన్నులో నుంచి చూసిన ప్రతిసారీ ఆమెకు వనదేవత కొత్తగా కనిపించేది. తన మనసును హత్తుకున్న దృశ్యాలను ప్రపంచపరం చేయాలనుకుందామె. ఐఎఫ్‌ఎస్‌ ఆశయాన్ని కలగా మరచిపోయి.. ఫొటోగ్రఫీ కళనే ప్రధానంగా ఎంచుకుంది. ఫొటో తీసినా, డాక్యుమెంటరీ నిర్మించినా ప్రకృతి వనరులను కాపాడాలనే సందేశమిచ్చేది. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. 14 ఏండ్లున్నప్పుడు ‘శాంక్చురీ ఆసియా యంగ్‌ నేచురలిస్ట్‌' పురస్కారం అందుకుంది. చిత్తడి నేలలను కాపాడుకోవాలంటూ తీసిన ‘ద లాస్ట్‌ వెట్‌లాండ్‌-పాంజి’ డాక్యుమెంటరీ నేషనల్‌ సైన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు నామినేట్‌ అయింది. రాయల్‌ బెంగాల్‌ టైగర్స్‌పై మరో డాక్యుమెంటరీ చిత్రీకరించింది. డిస్కవరీ చానెల్‌లో ‘నేచర్‌ ఫర్‌ ఫ్యూచర్‌' డిజిటల్‌ సిరీస్‌కు హోస్ట్‌గా పనిచేసింది.


అపురూపం ఆ దృశ్యం

ఇప్పుడు ఐశ్వర్యకు 23 ఏండ్లు. మాస్‌ మీడియాలో గ్రాడ్యుయేషన్‌ చేసింది. గతేడాది జూన్‌లో పడమటి కనుమల్లోని భండారదరకు స్నేహితులతో ట్రెక్కింగ్‌కు వెళ్లింది. కెమెరాలు మోసుకుంటూ కొండలు ఎక్కేసింది. వెన్నెల రేయిలో వనదేవత సింగారాన్ని క్లిక్‌ మనిపించాలనుకుంది. ఇంతలో మిణుగురు పురుగులు.. వందల్లో గింగిరాలు కొడుతున్నాయి. రెమ్మరెమ్మపై మిణుకు మిణుకు మంటూ వనస్నానం కోసం వచ్చిన నక్షత్రాల్లా అనిపించాయి.  ఐశ్వర్య ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అందమైన ఆ దృశ్యాన్ని అత్యద్భుతంగా ఒడిసిపట్టాలని భావించింది. కొన్ని గంటల పాటు చెట్టు పక్కనే వేచి ఉంది. మనసు కదలినప్పుడల్లా ఫొటోలు తీసింది. అందులో ఒక చిత్తరువే ఐశ్వర్యకు వైల్డ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును కట్టబెట్టింది. ఫొటోలు తీయడం, దర్శకత్వం వహించడంలోనే మేటి కాదు.. ఐశ్వర్య మంచి కవయిత్రి కూడా!

మరో గెలాక్సీ

లండన్‌లోని నేచురల్‌ హిస్టరీ మ్యూజియమ్‌ ఏటా ఫొటోగ్రఫీ కాంపిటేషన్‌ నిర్వహిస్తుంటుంది. ఈ దఫా దాదాపు 80 దేశాల నుంచి 50,000 ఫొటోల వరకు పోటీకి వచ్చాయి. వాటిలో వివిధ విభాగాల్లో 100 ఉత్తమ ఫొటోలను ఎంపిక చేశారు. అందులో ఐశ్వర్య తీసిన ఫొటో ‘అకశేరుకాల’ విభాగంలో ఉత్తమ ఫొటోగా నిలిచింది. ఇటీవల వర్చువల్‌ వేడుక నిర్వహించి ఐశ్వర్యకు అభినందనలు తెలిపారు మ్యూజియమ్‌ నిర్వాహకులు. అవార్డు వచ్చింది మొదలు మూడు రోజుల్లోనే 25వేల మంది ఈ ఫొటోను చూసి అచ్చెరువొందారు. మిణుగురు పూల మిలమిలలతో మరో గెలాక్సీ ఆవిష్కృతమైందని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అవార్డు దక్కించుకున్న అన్ని ఫొటోలతో ఈ నెల 16న మొదలైన ఎగ్జిబిషన్‌ 2021 జూన్‌ 6 వరకు కొనసాగనుంది.


logo