శనివారం 24 అక్టోబర్ 2020
Zindagi - Aug 23, 2020 , 22:50:52

నవ సామాజిక యోగినులు

నవ సామాజిక యోగినులు

అభిప్రాయాలు పంచుకునే వేదికలు సామాజిక మాధ్యమాలు. పోటాపోటీ పోస్టింగ్‌లతో అనవసరమైన చర్చలకు కూడళ్లుగా మారిపోతున్నాయవి. అయితే, ఈ యువతులు తమ ప్రతిభను సమాజానికి అంకితమిస్తున్నారు. కరోనా సమయంలో.. యోగ సాధనంగా ఇన్‌స్టాగ్రామ్‌ను ఎంచుకున్నారు. వేళకు అభ్యాసాలు చేయిస్తూ.. వేలల్లో ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.. మరెందరికో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు..

చలాకీ టీచర్‌: నమిత పిపరయ

ఎంబీఏ చేసింది నమిత పిపరయ. కొన్నాళ్లు ఓ కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగమూ చేసింది. యోగ కోసం కొలువును వదులుకుంది. ఇతర వ్యాపకాలనూ కాదనుకుంది. ముంబైకర్ల జీవనశైలిని స్వయంగా అనుభవించిన ఆమె.. యోగాభ్యాసం ద్వారా దానిని ఎదుర్కోవాలని భావించింది. అనుకుందే తడవుగా యోగనమ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌ను ప్రారంభించింది. హఠయోగ పాఠాలు చెబుతూ ఫాలోవర్ల సంఖ్యను రోజురోజుకూ పెంచుకుంటున్నది. ఇప్పటికే 35వేల మంది యోగనమను ఫాలో అవుతున్నారు. చిన్న చిన్న వ్యాయామాలతో పాటు కఠినమైన ఆసనాలు సైతం సులభంగా ఎలా వేయొచ్చో చూపిస్తుంటుంది నిధి. చలాకీగా ఆమె చేసే విన్యాసాలకు ఫాలోవర్లు ఫిదా  అవుతున్నారు.

 ఆసనాల నిధి: నిధి మోహన్‌

న్యూఢిల్లీకి చెందిన నిధిమోహన్‌ ఫుడ్‌ అండ్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదివింది. బాల్యం నుంచి యోగాభ్యాసం చేస్తున్నది. అష్టాంగ ఆసనంలో తన ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పుడు నిడ్‌సన్‌ వెల్‌నెస్‌ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో యోగసూత్రాలు చెబుతున్నది. దేశదేశాలకు చెందిన వాళ్లు నిధిని ఫాలో అవుతున్నారు. పదేండ్ల కిందటి నుంచే యోగ తరగతులు నిర్వహిస్తున్నది. పోషకాహార వివరాలు తెలియజేస్తున్నది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆసనాలు బోధిస్తోంది. ఈమె ఇన్‌స్టాగ్రామ్‌ను 75వేల మంది ఫాలో అవుతున్నారు. సంప్రదాయ ఆసనాలతో పాటు ఏకాగ్రత పెంచే అభ్యాసాలు చేయిస్తుంటుంది. రోగనిరోధకశక్తిని పెంచే ఆహార విశేషాలు అందరితో పంచుకుంటున్నది.

రోజురోజుకూ వేలమంది:   సునయనా రేఖి

కరోనాకు ముందు వర్క్‌షాప్‌లు, యోగా తరగతులతో తీరిక లేకుండా ఉండేది సునయనా రేఖి. కొవిడ్‌ కలకలం మొదలయ్యాక.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అదే జోరును కొనసాగిస్తున్నదామె. ఈ ముంబై యోగా టీచర్‌కు విదేశాల్లోనూ శిష్యులు ఉన్నారు. 61వేల మంది ‘సునయనా రేఖి అండ్‌ వెల్‌నెస్‌' ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవుతున్నారు. ప్రతి రోజూ నిర్ణీత సమయంలో లైవ్‌లో పాఠాలు చెబుతున్నది. బాలీవుడ్‌ సెలబ్రిటీలకూ శిక్షణ ఇస్తున్నది. ‘ఇలా నాలుగు గోడల మధ్య పాఠాలు చెబుతానని అస్సలు ఊహించలేదు. ఎంతమంది ఫాలో అవుతున్నారన్నది ఎప్పుడూ ఆలోచించలేదు. ఏ రోజుకారోజు ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌ కారణంగా యువతకు దగ్గరయ్యాను. కరోనా కల్లోలాన్ని ఎదుర్కోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు రోగనిరోధకశక్తి అత్యంత ఆవశ్యకం. యోగాసనాలు, ప్రాణాయామంతో వజ్రదేహం సంతరించుకుంటుంది. ఆ దిశగా పాఠాలు బోధిస్తున్నాను’ అని చెబుతున్నది సునయన రేఖి.

కొలువును కాదనుకొని:  పాల్‌ గెహ్లాట్‌

మనసు మాట వింటే ఏదైనా సాధిస్తామని, నిరాశ, నిస్పృహలు దగ్గరకు రావని, గతాన్ని పట్టించుకోకుండా భవిష్యత్తు కోసం కృషి చేయాలని చెబుతూ యోగాలో అద్భుతాలు సృష్టిస్తున్నది పాల్‌ గెహ్లాట్‌. 25 ఏండ్ల ఈ యోగా టీచర్‌ ఆన్‌లైన్‌లో ఆసనాలు నేర్పిస్తూ యువతకు ప్రేరణగా నిలుస్తున్నది. రాజస్థాన్‌లోని సిరోహికి చెందిన ఆమె 2017లో ఇంజినీరింగ్‌ చేసింది. జైపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఏడాదికి 4.80 లక్షల ఉద్యోగమూ సాధించింది. ఉద్యోగం చేయాలనిపించలేదు తనకు. ఇంకేదో చేయాలనుకొని కన్‌ఫ్యూజన్‌లో డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఓసారి ఇన్‌స్టాగ్రామ్‌లో యోగా వీడియో చూసింది. అంతే తను ఏం చేయాలో నిర్ణయించేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని రుషీకేశ్‌కు వెళ్లిపోయింది. అక్కడే యోగ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో సర్టిఫికేషన్‌ కోర్సు చేసింది. తర్వాత రుషీకేశ్‌లోనే ఉంటూ.. యోగా తరగతులు నిర్వహిస్తున్నది. ఆన్‌లైన్‌లోనూ పాఠాలు బోధిస్తున్నది పాల్‌ గెహ్లాట్‌. అమెరికా యోగా అలియాన్స్‌ ద్వారా కూడా అమె సర్టిఫికెట్‌ సాధించింది. యోగా, ప్రాణాయామం, ధ్యానం ఎలా చేయాలో నేర్పుతూ వేలమంది ఫాలోవర్స్‌ను సంపాదించింది. ఈ టీచరమ్మ దగ్గర ప్రత్యక్షంగా పాఠాలు నేర్చుకోవడానికి విదేశాల నుంచి శిష్యులు వస్తుండటం విశేషం.


logo