KCR | ఢిల్లీ మద్యం పాలసీలో స్కామ్ ఏమీ లేదని.. అసలు అది స్కామ్ కాదని.. నరేంద్ర మోదీ పొలిటికల్ స్కీమ్ అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. టీవీ9 డిబెట్లో పాల్గొన్న ఆయన ఢిల్లీ మద్యం పాలసీ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘లిక్కర్ స్కామ్ బోగస్. ఇది నరేంద్ర మోదీ సృష్టి. ఇందులో స్కామ్ ఎక్కడుంది. లిక్కర్ పాలసీ ఢిల్లీ ప్రభుత్వానిది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పాలసీ ఉంటుంది. ఇది స్కామ్ ఎలా అవుతుంది. నా కూతురు కడిగిన ముత్యంల బయటకు వస్తుంది. ఆమెకు సంబంధం లేదు. ఏమాత్రం సంబంధం లేదు. ఆమెను మొట్టమొదట విట్నెస్ కింద అని సీబీఐ వాళ్లు వచ్చారు. ఇవాళ అపరాధి అంటున్నరు. మూడు సంవత్సరాల నుంచి అదే ప్రశ్న. ఇంకో ప్రశ్న లేదు. ఎక్కడా రూపాయి రికవరీ లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రిని తీసుకెళ్లి జైలులో పెట్టారు’ అన్నారు.
‘అది నియంతృత్వానికి పరాకష్ట. ఒక ముఖ్యమంత్రికి బెయిల్ ఇవ్వరా? ముఖ్యమంత్రి పారిపోతాడా? కవిత ఎమ్మెల్సీ. పారిపోతదా? ఎంపీ, ఎమ్మేల్యేలకు బెయిల్ ఇవ్వకుండా సంవత్సరాల తరబడి, నెలల తరబడి. ఈ దేశంలో ఏం జరుగుతుంది. ఇందులో ఏం స్కామ్ లేదు. రూపాయి రికవరీ కాలేదు. ఎవడు ఎవరికి ఇచ్చింది పట్టుకున్నది లేదు. అంతా గాలిలో కట్టుకథ అల్లి.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్డంపెట్టుకొని.. ఆయనతో ఆర్డర్ ఇప్పించి.. ఇది స్కామ్.. పరిశోధన చేయాలని చెప్పి.. సీబీఐ, ఈడీకి ఇచ్చి అనవసరంగా అమాయకులను నరేంద్ర మోదీ శిక్షిస్తున్నడు. నరేంద్ర మోదీ దుకాణం 700 మంది ప్రజాప్రతినిధుల ఇతర రాజకీయ పార్టీల నుంచి గుంజుకున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వాలను కూల్చారు. మన పక్కనే కర్నాటకలో కూల్చారు. మధ్యప్రదేశ్‌లో కూల్చారు’ అన్నారు.
‘అందులో భాగంగా తెలంగాణలో దుకాణం పెట్టడానికి వచ్చారు. ఎమ్మెల్యేలను కొనాలి. వాళ్లు దొరికితే పట్టి జైలులో పడేశాం. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అని ఎవరైతో ఉన్నారో.. దీనికి మూలసూత్రధారి కాబట్టి.. ఢిల్లీలో ఉండే బీజేపీ సెంట్రల్లో కూర్చుంటాడని పోలీసులను పంపాం. బీఎల్ సంతోష్‌పై కేసు పెట్టామని.. కక్ష్య పెట్టుకొని నా కూతురుపై కేసు పెట్టడమేంది. ఆడపిల్ల అని చూడకుండా నిర్బంధించి.. ఎన్నికలకు ముందు కేసీఆర్ అపఖ్యాతి పాలు చేస్తే మనకేమో వస్తదని బీజేపీ అనుకున్నది. దాని ఫలితం అనుభవిస్తారు కదా? ఘోరమైన పాపకృత్యం మోదీ చేశారు. కేసులో ఆరోపణలున్న వ్యక్తే బీజేపీకి రూ.50కోట్లు ఎన్నికల బాండ్లు ఇవ్వగానే రిలీజ్ చేశారు. దానికి ఏం చేస్తారు. అసలు అది స్కామ్ కాదు.. నరేంద్ర మోదీ పొలిటికల్ స్కీమ్. ఢిల్లీ మద్యం పాలసీలో స్కామే లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన కుట్రే. అమాయకులను వేధిస్తున్నది. మూడుసార్లు పరాభవానికి గురైన అరవింద్ కేజ్రీవాల్ చేతులో ఘోర పరాభావానికి గురయ్యారు. అక్కడ ఆయనను.. ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ఇద్దరిని అరెస్టు చేశారు. కేజ్రీవాల్, కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. నాకు నమ్మకం ఉంది’ అన్నారు.