గాడిద పాలు చిన్నపిల్లల్లో ఉబ్బసం, ఆస్తమా, దగ్గు, కఫం వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తాయని తెలిసిందే! వీటిని సౌందర్య సాధనాల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఈ అంశాన్ని అవకాశంగా మలుచుకున్నది కోయంబత్తూరుకు చెందిన 26 ఏండ్ల మహాలక్ష్మి. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన మహాలక్ష్మి వినూత్న వ్యాపార సూత్రాన్ని ఎంచుకున్నది. గాడిద పాలతో సబ్బుల్ని తయారుచేస్తూ తన కృషి, ప్రతిభతో సంవత్సరానికి కోటికి పైగా ఆదాయాన్ని పొందడమే కాకుండా పలువురికి ఉపాధి చూపుతున్నది.
సరిగ్గా మూడేండ్ల కిందట మహాలక్ష్మి స్వయం ఉపాధి వ్యాపారాన్ని ప్రారంభించింది. ఆర్థికంగా స్వతంత్ర జీవితాన్ని గడపాలనే కోరికతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. యూట్యూబ్ వీడియోలను చూస్తూ సబ్బుల వ్యాపారం చేయడానికి ప్రయత్నించింది. కానీ, విఫలమైంది. ఇలా లాభం లేదనుకొని తక్కువ ఖర్చుతో నాణ్యమైన సబ్బుల తయారీకి నడుం బిగించింది. ‘తక్కువ ధరతో ఉత్తమ సబ్బు’ అనే నినాదంతో ముందుకొచ్చింది. అధిక నాణ్యత గల సబ్బుల తయారీకి ఉపయోగపడే చాలా పదార్థాలను క్షుణ్నంగా అన్వేషించింది. సబ్బుల తయారీకి ఉపయోగించే ముడిపదార్థాల్లో మేకపాలు ఒకటని కనుక్కున్నది. కానీ, అదే సమయంలో, మార్కెట్లో మేకపాల సబ్బులను విక్రయించే బ్రాండ్లు చాలానే ఉన్నాయని తెలిసొచ్చింది. అయితే సౌందర్య సాధనలో మేకపాల కన్నా గాడిద పాలు మరింత ప్రశస్తంగా పనిచేస్తాయని తెలిశాక ముందడుగు వేయాలని నిశ్చయించుకుంది. స్థానికంగా ఉండే గాడిదల పోషకులతో చర్చించి పదేండ్ల దాకా పాలు విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకుంది. సాధ్యమైనంత తక్కువ ధర ఉండేలా జాగ్రత్తపడింది.
గాడిద పాలు ముడిసరుకుగా మహాలక్ష్మి సబ్బుల తయారీ చేపట్టింది. పదిమందికీ ఉపాధి కల్పిస్తూ.. నెలల వ్యవధిలోనే విపణిలోకి ఎంట్రీ ఇచ్చింది. 2020లో సబ్బుల అమ్మకం మొదలైంది. ఇప్పుడు నేరుగా పదివేల మందికి సబ్బులు విక్రయిస్తున్నది. ఐదారు దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నది. దాదాపు 500 మంది మహాలక్ష్మి దగ్గర హోల్సేల్ ధరకు సబ్బులు కొనుగోలు చేసి మంచి లాభాలకు అమ్ముకుంటున్నారు. మొత్తంగా మూడేండ్లు తిరిగేసరికి ఏడాదికి కోటి రూపాయల టర్నోవర్ సాధించింది. గరిటెడు ఖరము పాలు ఇచ్చినా వాటితో కడివెడు కాసులు సంపాదించొచ్చని ఆంత్రప్రెన్యూర్లకు కొత్త అవకాశాల దారి చూపించిన మహాలక్ష్మికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!