సోమవారం 01 మార్చి 2021
Yadadri - Sep 19, 2020 , 00:34:25

సిరులు కురిపిస్తున్న పాడి సంపద

సిరులు కురిపిస్తున్న పాడి సంపద

ప్రత్యామ్నాయం.. లాభాలు ఘనం..

పాడి పోషణను ఉపాధిగా ఎంచుకున్న రైతులు

మదర్‌ డెయిరీకి ఒక్కో రైతు నిత్యం 10లీ. నుంచి 70లీ.పాలు తరలింపు

పాడి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న చొల్లేరు

నెలకు రూ. 10 నుంచి 40 వేల ఆదాయం

ప్రతి ఇంట్లో  రెండు నుంచి ఐదు పాడి పశువులు

కలిసివచ్చిన ప్రభుత్వ సబ్సిడీ రుణాలు


వ్యవసాయమే కాకుండా ప్రత్యామ్నాయంపై ప్రత్యేక శ్రద్ధ చూపిన చొల్లేరు గ్రామంలోని రైతులు పాడి సంపదతో లాభాలు గడిస్తున్నారు. ప్రతి ఇంటికి కనీసం రెండు పాడి పశువులను సాకుతూ పాల ఉత్పత్తితో జీవనం సాగిస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి పశుపోషణలో అనుభవం ఉన్నవారు ప్రతి నిత్యం 20 నుంచి 70 లీటర్ల వరకు డెయిరీలకు పాలు పోస్తున్నారంటే ఇక్కడి ప్రజలు పాడి సంపదపై ఎంత ఆసక్తి కనబరుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దాదాపు గ్రామస్తులందరూ పాడి పోషణతోనే లాభాలు గడిస్తూ జిల్లాలోనే మంచి గుర్తింపు పొందారు. ఇతర గ్రామస్తులకు ఆదర్శంగా నిలుస్తూ, ఒక్కో రైతు రూ.10నుంచి 40 వేలకు ఆదాయం పొందుతున్నారు.   

ఆలేరు : జిల్లాలోని యాదగిరిగుట్ట మండల పరిధిలోని చొల్లేరు గ్రామంలో 550 కుటుంబాలు ఉండగా, దాదాపు 350 కుటుంబాలు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇందులో 300 కుటుంబాల రైతులు ప్రత్యామ్నాయ పంటలైన పాల ఉత్పత్తికి పాడి పోషణపై దృష్టి సారిస్తూ వస్తున్నారు. కనీసం ప్రతి ఇంటికి రెండు నుంచి ఆరు పాడి పశువులు ఉండని కుటుంబాలు కనిపించవు. ఆయా కుల వృత్తులు చేసేవారు సైతం ఆయా పనులతోపాటు పశువుల పెంపకం చేపడున్నారంటే అతిశయోక్తిలేదు. ఒక్కో కుటుంబం నుంచి ప్రతినిత్యం 10లీటర్ల నుంచి గరిష్టంగా 70 లీటర్ల పాలు డెయిరీ సెంటర్లకు పోస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి వారి పాడి సంపద మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతుండటంతో గ్రామస్తులందరూ పాల ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

రోజుకు 2500 లీటర్ల పాల ఉత్పత్తి..

చొల్లేరు గ్రామంలోనే నెలకొల్పిన మదర్‌డెయిరీ సెంటర్‌కు దాదాపుగా 1600 లీటర్ల పాలు వస్తున్నట్లు సెంటర్‌ నిర్వాహకులు చెబుతున్నారు. మరో ఇతర ప్రైవేట్‌ సెంటర్‌లో మరో 500 లీటర్లు, ఇతర పాడి రైతులు హైదరాబాద్‌కు తరలించేవారి వద్ద మరో 400లీటర్లు పాలు కలిపి గ్రామంలో రోజుకు 2500 లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి వ్యవసాయం తగ్గించి పశువుల పెంపకం చేపడుతున్న రైతులు రోజురోజుకు పశువుల సంఖ్యను పెంచడంతోపాటు పాల ఉత్పత్తిపై దృష్టి పెడుతున్నారు. దీంతో ప్రతినిత్యం పాల ఉత్పత్తి పెరుగుతూ ప్రస్తుతం 2500 లీటర్ల పాలు ఎగుమతి చేస్తుండటం గర్వించదగిన విషయంగా అధికారులు తెలిపారు. ఇలాగే పాడి సంపదను పెంచుతూ పోతే పాల ఉత్పత్తిలో చొల్లేరు గ్రామం అగ్రగామిగా నిలువడం ఖాయమని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

120 సబ్సిడీ పాడి బర్రెలు

పాడి సంపదను పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక చర్యలు చేపట్టారు. పశుసంవర్థకశాఖ నుంచి ప్రతి పాడి రైతుకు  సబ్సిడీ పాడి గేదేలు మంజూరు చేశారు. జిల్లాలోనే అత్యధికంగా ఒక చొల్లేరు గ్రామస్తులే 120 పాడిగేదేలను కొనుగోలు చేశారు. ప్రభు త్వం అనుసరిస్తున్న విభిన్న పంటసాగు, ప్రత్యామ్నాయ వ్యవసాయం వంటి అంశాలను వంటపట్టిచ్చుకున్న చొల్లేరు గ్రామస్తులు ఆ దిశగా పయణిస్తూ లాభాలు గడిస్తున్నారు. వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా రైతులు పాడి పోషణతో లాభాలు గడిస్తూ సొంత గ్రామంలోనే ఉపాధి పొందుతూ పాల ఉత్పత్తి చేపడుతున్న చొల్లేరు గ్రామాన్ని ఇతర గ్రామాల రైతులు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వ్యవసాయంతో పాటు పాడి పోషణ చేపట్టినట్లయితే పొందే మేలును గుర్తించి  అన్ని గ్రామాల్లో పశువులను పెంచుతూ ఉపాధి పొందవచ్చని నిరూపిస్తున్న చొల్లేరు పాల ఉత్పత్తి రెట్టింపు చేస్తూ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలువాలని ఆశిద్దాం.


ఇంటి ఖర్చులకు ఇబ్బంది లేదు

ఒక వైపు వ్యవసాయం చేసుకుంటునే పాల ఉత్పత్తిపై దృష్టి పెట్టాను. నాకు ఉన్న 5 ఆవులతో రోజుకు 15 లీటర్లు పాలు వస్తాయి. దీంతో నెలకు రూ.8వేల నుంచి 10 వేల ఆదాయం వస్తుంది. వ్యవసాయంలో నష్టం వస్తే, పాల ఉత్పత్తి నుంచి వచ్చే ఆదాయంతో ఇంటి ఖర్చులకు ఇబ్బందులు లేకుండా పోయింది.

- గడసంత స్వామి, పాడి రైతు, చొల్లేరు గ్రామం

ఉత్పత్తిని మరింత  పెంచుతాం

గ్రామంలోనే డెయిరీలు అందుబాటులో ఉండటంతో ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. దాదాపు మదర్‌ డెయిరీకే ప్రతిరోజు 1600 లీటర్ల వస్తున్నాయి. రైతులకు ప్రతి పది రోజులకు ఒకసారి బిల్లులు చెల్లిస్తున్నాం. నాణ్యమైన పాలకు గరిష్టంగా లీటరుకు ఆవుపాలకు రూ.29.50, బర్రె పాలకు రూ.30 నుంచి 40 వస్తుండటంతో ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు మరింత ఆసక్తి చూపాలని పాడి రైతులకు కోరుతున్నాం. - కౌకుంట్ల రామచంద్రారెడ్డి, 

పాల సంఘం చైర్మన్‌, చొల్లేరు గ్రామం

ప్రధాన ఆదాయ వనరు

పదేండ్లుగా పాల ఉత్ప త్తిపై జీవనం సాగిస్తు న్నాం. మొదటగా ఒకటితో ప్రారంభమైన ఇప్పుడు 4 గేదేలను కొనుగోలు చేశాం. సీఎం కేసీఆర్‌ సబ్సిడీ గేదే అందజేశారు. దీంతో మరింతగా పాల ఉత్పత్తి పెంచే అవకాశం వచ్చింది. ప్రస్తుతం రోజుకు 10లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నాను. నెలకు రూ. 10 వేల ఆదాయం వస్తుంది. సంతోషంగా ఉంది. - తోటకూరి నర్సింహులు, పాడిరైతు, చొల్లేరు

VIDEOS

logo