గులాబీ పండుగ

- జిల్లాలో నేటి నుంచి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రారంభం
- యాదగిరిగుట్ట మండలం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
- పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు నేతృత్వంలో పదిహేను రోజులు కొనసాగనున్న నమోదు
గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లాలో శుక్రవారం నుంచి మొదలుకానుంది. 15 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శాసనసభ నియోజకవర్గాల వారీగా పార్టీ విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహించి అక్కడి నుంచే సభ్యత్వాలకు శ్రీకారం చుడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు జనరల్ సెక్రటరీగా తక్కళ్లపల్లి రవీందర్ రావు, యాదాద్రి భువనగిరి జిల్లా సెక్రటరీ ఇన్‌చార్జీగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు నియామకం అయ్యారు. వీరి నేతృత్వంలో సభ్యత్వ నమోదు కొనసాగిస్తూ ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించారు. యాదగిరిగుట్టలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి శుక్రవారం సభ్యత్వ నమోదును లాంఛనంగా ప్రారంభించనున్నారు.
నియోజకవర్గానికి 50 వేల టార్గెట్.. ఎమ్మెల్యేలపైనే బాధ్యతలు
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి11 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి ): జిల్లాలోని భువనగిరి, ఆలేరు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. సంస్థాగతంగా పార్టీని పటిష్టపర్చడంలో భాగంగా ఇటీవలనే తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి రానున్న రోజుల్లో పార్టీపరంగా నిర్వహించే కార్యక్రమాలపై పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. ఇందులో పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. గతంలో కంటే ఎక్కువ సభ్యత్వాలు చేయాలని చెప్పిన కేసీఆర్ నియోజకవర్గానికి 50వేల సభ్యత్వాలు టార్గెట్ విధించారు. ఉమ్మడి జిల్లాతోపాటు, యాదాద్రి భువనగిరి జిల్లాకు పర్యవేక్షకుడితోపాటు ఇన్చార్జిని నియమించారు. పదిహేను రోజుల పాటు పండుగ వాతావరణంలో యజ్ఞంలా సభ్యత్వ నమోదు చేపట్టేందుకు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నియోజకవర్గానికి 50వేల సభ్యత్వాలు
జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 50 వేల చొప్పున పార్టీ సభ్యత్వాలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన జిల్లాలో మొత్తం లక్ష మందిని సభ్యులుగా చేర్పించాలనేది లక్ష్యం. సాధారణ, క్రియాశీలక సభ్యత్వాలు ఎన్ని చేయలన్న దానిపై కూడా నిర్దేశిత లక్ష్యాలు విధించారు. సాధారణ సభ్యత్వానికి రూ.30, క్రియాశీల సభ్యత్వానికి ఎస్సీ, ఎస్టీలకు రూ.50, ఇతరులకు రూ.100గా రుసుం నిర్ణయించారు. రెండేండ్ల కిందట లక్ష్యానికి మించి సభ్యత్వాల నమోదు చేయగా, ప్రస్తుతం అంతకుమించి నమోదు కానున్నట్లు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యేలతోపాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు కూడా సభ్యత్వ నమోదులో బాధ్యత తీసుకోనున్నారు. మార్చి మొదటివారంలో గ్రామ, మండల, డివిజన్, పట్టణ స్థాయిల్లో సంస్థాగత కమిటీలు ఏర్పాటు చేయనుండటంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా సభ్యత్వ నమోదులో పాలుపంచుకోనున్నారు.
నేడు యాదగిరిగుట్ట మండలం నుంచి లాంఛనంగా ప్రారంభం
యాదగిరిగుట్ట మండలం గుండ్లపల్లి పరిధిలోని శ్రీలక్ష్మీ నరసింహ గార్డెన్స్‌లో ఆలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం లాంఛనంగా ప్రారంభం కానున్నది. విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి వై.వెంకటేశ్వర్లు, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి హాజరవుతున్నారు.