సుబేదారి, అక్టోబర్ 8 : వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అనుచరుడు, యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్ ప్రభుత్వ ఉద్యోగాలు పేరుతో దందాలకు పాల్పడుతున్నాడు. ఈ ఘటన హనుమకొండలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి భర్త కాల్ రికార్డ్సుతో ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వివరాల్లోకి వెళితే.. వరంగల్ రంగంపేటకు చెందిన గన్నారాపు సుమలతకు హనుమకొండలోని మార్కజీ ప్రభుత్వ పాఠశాలలో ఔట్సోర్సింగ్ అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తోట పవన్ మధ్యవర్తి శివ ద్వారా ఎన్జీవోస్ కాలనీలోని తన సాయి పవన్ ఇఫ్రా డెవలఫర్స్ ఆఫీస్‌లో సుమలత భర్త నుంచి రూ.2 లక్షలు తీసుకొని, రూ.1.30 లక్షలకు రసీదు ఇచ్చాడు. నాలుగు నెలలు గడిచినా ఉద్యోగం రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితురాలి భర్త పవన్‌ను అడిగితే అనుచరుడి ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అనుచరుల దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి అనుచరుడు పోలీసుల అండతో సెటిల్మెంట్లు, భూ దందాలు, అధికార పార్టీ క్యాడర్‌ను పోలీ సులతో కొట్టించిన ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వరంగల్ పశ్చిమ నియోజక వర్గం లో ఎమ్మెల్యే అనుచరుడి ఉద్యోగాల దందా వెలుగులోకి వచ్చింది.
ఉద్యోగం ఇప్పిస్తానని పవన్ రూ.2 లక్షలు తీసుకున్నడు
నాలుగు నెలల క్రితం తోట పవన్ తన భార్యకు హనుమకొండలోని మర్కాజీ ప్రభుత్వ పాఠశాలలో ఔట్ సోర్సింగ్ అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఆయన ఆఫీసులో రూ.2 లక్షలు తీసుకున్నడు. ఇందులో రూ.1. 30 లక్షలకు రసీదు ఇచ్చాడు. నాలుగు నెలలు గడిచినా ఉద్యోగం ఇప్పించలేదు. మా డబ్బులు మాకు ఇవ్వాలని పవన్‌కు చాలా సార్లు ఫోన్ చేస్తే లిప్ట్ చేయడం లేదు. పైగా అతడి అనుచరుడు సంజయ్‌పటేల్ ద్వారా వాట్సాప్ కాల్ చేసి బెదిరిస్తున్నాడు. ఎమ్మెల్యే, పోలీస్ అధికారులు మాకు న్యాయం చేయాలి.
– బాధితురాలి భర్త గన్నారాపు ప్రదీప్‌రాజ్