రాయపర్తి, ఆగస్టు 12 : వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని కొండూరు రోడ్డులోఉన్న రామచ్రందుని చెరువులో ఓ యువతి, యువకుడి మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. చెరువు కట్టపై పల్సర్ బైక్, యువతి హ్యాండ్ బ్యాగ్ లభించడంతో వారిని హనుమకొండ మండలం పైడిపల్లి గ్రామ పరిధి మధ్యగూడేనికి చెందిన తిక్క అంజలి (26), సంగాల దిలీప్ (30)గా గుర్తించారు. ఆదివారమే వారు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు తెలిపిన, మృతుల వద్ద లభించిన ఆధారాల మేరకు వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని జేరుతండాకు చెందిన కొందరు కాపరులు మేకలను మేపేందుకు చెరువు వద్దకు వెళ్లగా నీటిపై మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. వారిచ్చిన సమాచారం మేరకు వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ జీడి సూర్యప్రకాశ్, ఎస్సై ప్రవీణ్‌కుమార్ ఘటనా స్థలికి చేరుకొని క్లూస్‌టీం సహాయంతో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వారికి చెరువు కట్టపై బైక్, హ్యాండ్‌బ్యాగ్, నీళ్లబాటిల్, మృతుల చెప్పులు లభించగా వాటి ఆధారంగా వారిని మధ్యగూడేనికి చెందిన అంజలి, దిలీప్‌గా గుర్తించారు. వారిద్దరిదీ ఒకే గ్రామం కావడంతో వారి మధ్య ప్రేమ వ్యవహారం ఉంటుందని కొంద రు, వివాహేతర సంబంధం కావచ్చని మరికొందరు చర్చించుకుంటున్నారు.
కాగా మృతుడు దిలీప్‌కు నెక్కొండ మండలంలోని బంజర్‌పల్లి గ్రామానికి చెందిన శిరీషతో వివాహం కాగా ఇద్దరు ఆడ పిల్లలున్నట్లు సమాచారం. మృతులిద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం కారణంగా దిలీప్ కుటుంబంలో తర చూ గొడవలు జరుగుతుండడంతో అతడి భార్య శిరీష ఐదేళ్ల నుంచి తన తల్లిగారింట్లోనే ఉంటున్నట్లు తెలిసింది. వీరి ఆత్మ హత్యకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, చెరువులో నుంచి మృతదేహాలను బయటకు తీ యించిన పోలీసులు శవ పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
కాశీబుగ్గ : గ్రేటర్ వరంగల్‌లోని 3వ డివిజన్ పైడిపల్లిలోని మధ్యగూడెంకు చెందిన దిలీప్, అంజలి ఆత్మహత్మ చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. వివాహితుడైన దిలీప్ హనుమకొండ హంటర్‌రోడ్‌లోని మార్బుల్షాపులో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అతడికి వరుసకు సోదరి అయిన అంజలి ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నట్లు తెలిసింది. విషయం తెలిసిన వెంటనే స్థానికులు, బంధువులు పెద్ద ఎత్తున వారి ఇళ్లకు చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు.