ఖిలావరంగల్: అధునాతన వైద్య నైపుణ్యంతో హై రిస్క్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ వియజయవంతంగా పూర్తి చేసినందుకు తమ వృత్తి పట్ల గర్వంగా ఉన్నట్లు యశోద హాస్పిటల్స్ ప్రకటించింది. శివనగర్‌లోని పల్లవి హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ అరుణ్ పొన్న విజయవంతమైన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తకొండకు చెందిన మంచాల వెంకటేశ్వర్లు తీవ్రమైన ఊబకాయం, రెండు కాళ్ల పక్షవాతం, పల్మనరీ ట్యూబర్క్యులోసిస్, హెపటైటిస్ సిలో-గ్రేడ్ సార్కోమా వంటి అనేక ఆరోగ్య సమస్యలతో మల్కాజిగిరి యశోద హాస్పిటల్‌కు వచ్చారన్నారు. ఏడాదినర్నకు పైగా అనేక సవాళ్లతో కూడిన చికిత్స అందించామన్నారు.
అనేక వ్యాధులు, శస్త్రచికిత్స వలన ఎదురయ్యే సమస్యలు ఉన్నప్పటికీ, ఎదురయ్యే అన్ని పరిస్థితుల గురించి నిర్ధారణ తర్వాత కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ నిర్వహించాలనే దృఢ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సాధారణ ట్రాన్స్ ప్లాంట్ కంటే ఈ కేసు ప్రత్యేకమైనదన్నారు. కిడ్నీ బాధితుడికి ఆయన భార్య పూజిత ప్రేమతో కిడ్నీ దానం చేశారని తెలిపారు. ట్రాన్స్ ప్లాంట్ ప్రక్రియ కోసం అత్యంత జాగ్రత్తగా ప్రణాళిక సిద్ధం చేసుకుని, వివిధ వైద్య బృందాలతో కలిసి నిర్వహించి విజయవంతమైన ఫలితం సాధించామన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ పొన్న దశరథం, మంచాల వెంకటేశ్వర్లు, పూజిత దంపతులు, పీఆర్వో రమేష్ తదితరులు పాల్గొన్నారు.