వరంగల్, ఫిబ్రవరి 24(నమస్తేతెలంగాణ) : ప్రస్తుత యాసంగి వడ్లను కొనబోమని ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వైఖరిని ఎండగట్టింది. తెలంగాణ రైతుల నుంచి యాసంగి వడ్లను కొని తీరాలని డిమాండ్ చేసింది. పంజాబ్ రాష్ట్రంలో యాసంగి వడ్లను కొనుగోలు చేస్తూ తెలంగాణ రైతుల నుంచి కొనబోమన్న కేంద్రం నిర్ణయంపై టీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ససేమిర అనడంతో రాష్ట్ర ప్రభుత్వం యాసంగి వరి పంట సాగు చేయొద్దని రైతులను కోరింది. యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనకుంటే రైతులు నష్టపోవల్సి వస్తుందని పేర్కొంది. వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని విస్తృత ప్రచారం చేసింది. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతుబంధు ప్రతినిధులతో కలిసి ఇతర పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. అపరాల సాగుకు రైతులను ప్రోత్సహించారు. దీంతో యాసంగి వరి సాగు విస్తీర్ణం జిల్లాలో తగ్గింది. ఇటీవల వ్యవసాయశాఖ అధికారులు రైతులు సాగు చేసిన పంటల విస్తీర్ణాన్ని క్షేత్రస్థాయిలో గుర్తించారు.
జిల్లాలోని పదమూడు మండలాల్లో రైతులు గత ఏడాది యాసంగి 97,089 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ విస్తీర్ణం నుంచి దిగుబడి వచ్చిన వడ్లను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందుకోసం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించింది. ప్రభుత్వ మద్దతు ధరతో రైతులు సదరు కేంద్రాల్లో యాసంగి వడ్లను విక్రయించారు. కొన్నేళ్ల నుంచి వరుసగా రైతులకు ప్రభుత్వ మద్దతు ధర దక్కాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా వానకాలం, యాసంగి ధాన్యం కొనుగోలు చేసింది. దీంతో వరి రైతులు ప్రభుత్వ మద్దతు ధర పొందారు. ఈ క్రమంలో యాసంగి వడ్లను కొనబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వడ్లను కొనబోమని కేంద్రం తేల్చి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం వరి సాగు చేయొద్దని రైతులకు చెప్పింది. వరికి మద్దతు ధర వచ్చే అవకాశం లేదని, తక్కువ ధరపై వ్యాపారులకు అమ్మి నష్టపోవాల్సి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు రైతులు ప్రస్తుత యాసంగి వరి పంటను సాగు చేయడంపై ఆలోచించారు. సాగు చేశాక తీరా వడ్లను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోతే పెట్టుబడి సైతం కోల్పోతామని కొందరు వరి సాగుకు పూర్తిగా దూరంగా ఉన్నారు. మరికొందరు సాగు విస్తీర్ణం తగ్గించారు. దీంతో సాగు విస్తీర్ణం 61,822 ఎకరాలకు తగ్గింది. గతేడాదితో పోలిస్తే 36శాతం తగ్గినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం యాసంగి జిల్లాలోని రైతులు 1,30,471 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేశారు.
ఉషాదయాళ్, జిల్లా వ్యవసాయ అధికారి, వరంగల్ వడ్లను కొనబోమని కేంద్రప్రభుత్వం చెప్పడం వల్ల రైతులు యాసంగి వరి సాగు విస్తీర్ణం తగ్గించారు. ఖానాపురంతో పాటు పలు మండలాల్లో చెరువుల కింద కూడా సాగు చేయలేదు. కొందరు ఇతర పంటలను సాగు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ యాసంగిలో వరి సాగు విస్తీర్ణం జిల్లాలో చాలావరకు తగ్గింది. పంట మార్పిడిపై గ్రామాల్లో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాం. పంటల నమోదు కార్యక్రమం కూడా పూర్తి కావొచ్చింది.