Ghost Employee : అమెరికా (USA) లో ఆ దేశానికి చెందిన ఓ కంపెనీని భారత సంతతి వ్యక్తి కోట్ల రూపాయల చీట్ చేశాడు. ఉద్యోగం చేయకపోయినా తన స్నేహితుడిని ఉద్యోగిగా నియమించుకుని, అతడి పేరుతో నెలనెలా వేతనం తీసుకున్నాడు. ఇతర సదుపాయాలూ అనుభవించారు. ఇటీవల ఈ ఘోస్ట్ ఉద్యోగి (Ghost Employee) వ్యవహారం వెలుగుచూడటంతో కంపెనీ పోలీసులకు ఫిర్యాదుచేసింది. దర్యాప్తులో నిందితుడు సంస్థను మోసం చేసినట్లు నిర్ధారణ అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే.. భారత సంతతికి చెందిన కరణ్ గుప్తా.. మిన్నెసోటా రాష్ట్రంలో ఉన్న యునైటెడ్ హెల్త్ గ్రూప్‌లో పనిచేసేవాడు. దానికి అనుబంధ సంస్థ ‘ఆప్టమ్’ లో డేటా అనలటిక్స్ విభాగానికి సీనియర్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అతడి వార్షిక వేతనం 2.60 లక్షల డాలర్ల కంటే ఎక్కువే. ఈ క్రమంలో 2015లో అర్హత లేకున్నా తప్పుడు దస్త్రాలు సృష్టించి అతడి స్నేహితుడిని ఉద్యోగిగా నియమించుకున్నాడు. తన టీమ్‌లోనే పనిచేసేలా జాబ్‌రోల్ కేటాయించాడు.
అతడి మిత్రుడు సంస్థలో పనిచేయకున్నా అతడి పేరిట ప్రారంభంలో లక్ష డాలర్లకుపైగా వార్షిక వేతనం అందుకున్నాడు. ప్రతిఏటా జీతం పెంపుతోపాటు బోనస్‌లను కూడా పొందాడు. అతడి స్నేహితుడు ఉద్యోగిగా వేతనం పొందుతున్నప్పటికీ ఆ సంస్థలో ఒక్క సహోద్యోగినీ కలవలేదు. ఆయనకు సంబంధించి ఒక్క మెయిల్ లేదు. అసలు అతనికి కేటాయించిన కంప్యూటర్లో లాగిన్ కూడా కాలేదు. అయినా ఏళ్ల తరబడి వేతనం తీసుకున్నాఆరు.
అతడి స్నేహితుడికి వచ్చే జీతంలో సగానికిపైగా గుప్తా ఖాతాలోకి చేరేది. న్యూజెర్సీలో ఉండే ఆ స్నేహితుడు నగదు విత్‌డ్రా చేసి గుప్తా అకౌంట్లో సగానికిపైగా వేసి, మిగతాది తాను తీసుకునేవాడు. అయితే 2019 నవంబర్‌లో ఓ మోసం కేసులో గుప్తాను సదరు సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. అదే సమయంలో ఈ మోసం కూడా బయటపడింది. సంస్థ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దర్యాప్తు సంస్థలు.. మొత్తంగా 1.2 మిలియన్ డాలర్లు (రూ.10 కోట్లు) మోసంతోపాటు, మనీలాండరింగ్ కుట్ర ఉన్నట్లు తేల్చాయి. అక్కడి కోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది. త్వరలో తీర్పు ఇవ్వనుంది.