సుబేదారి, డిసెంబర్ 16 : మహిళలు, బాలికలపై లైంగికదాడులకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహిళ లు, బాలికల భద్రతపై శుక్రవారం హనుమకొండలోని కమిషనరేట్లో మహిళా పోలీస్స్టేషన్లు, షీటీమ్స్, భరోసా విభాగాల పోలీస్ అధికారులతో సీపీ సమీక్ష నిర్వహించారు. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరుపై క్రైమ్స్, ఆపరేషన్స్ ఇన్చార్జి, అడిషనల్ డీసీపీ పుష్పారెడ్డి సీపీకి వివరించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ తప్పిపోయిన మహిళలు, బాలికల ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక చ ర్యలు తీసుకోవాలన్నారు.
క్రైమ్స్ సేవలు వినియోగించుకోవడంతో పాటు పోక్సో కేసు నిందితులకు కఠిన శిక్ష పడేలా భరోసా విభాగం అధికారులు కోర్టులో సాక్ష్యా లు అందజేయాలని సీపీ సూచించారు. మహిళలపై లైం గిక దాడులు పాల్పడుతున్నది అత్యంత దగ్గరి వ్యక్తులే అని ఈవిషయంపై అవగాహన కల్పించాలన్నారు. గొడవలు పడే భార్యాభర్తలను మహిళా పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది రాజీమార్గంలో కలిపేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు. కమిషనరేట్ పరిధిలో మహిళల రక్షణ కోసం షీటీమ్స్ మరింత బలోపేతం చేయాలని సీపీ పేర్కొన్నారు. సమీక్షలో మహిళా ఇన్స్పెక్టర్లు సువర్ణ, సుజాత, మహిళా పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు కుమారస్వామి, ఉస్మాన్షరీఫ్, షీటీమ్స్ ఇన్స్పెక్టర్ సంజీవ పాల్గొన్నారు.