ఆత్మకూరు, ఏప్రిల్1: మండలం కేంద్రంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి ఉచిత బస్సు సౌకర్యాన్ని వెంటనే తీసివేయాలని మహిళలు మొర పెట్టుకున్నారు. దీంతో ఎమ్మెల్యే షాక్‌తో తడబడి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తుండగా మీరు ఆ విధం గా ఎందుకు మాట్లాడుతున్నారని అడిగాడు.
ప్రభుత్వం బస్సు చార్జీలు తీసుకుంటూనే తమకు గౌరవం దక్కుతుందని, ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న తీరు బాగా లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అలా చేస్తున్నారా.. ఈ విషయాలను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అవసర మైతే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన కల్పించి మహిళలకు గౌరవం దక్కేలా చూస్తానని సర్ది చెప్పారు. ఇప్పటికీ ప్రభుత్వం అప్పుల్లో కూరుకపోయిందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందించలేక పోతున్నామని స్పష్టం చేశారు.
ఎన్నికల ముందు ప్రజలకు సన్న బియ్యాన్ని ఇస్తామని ఎక్కడా చెప్పలేదని, పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభు త్వం సన్న బియ్యాన్ని అందించాలనే లక్ష్యంతో రేషన్ కార్డుదారులందరికీ ఇస్తామన్నారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీవో నారాయణ, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ జగన్మో హన్ రెడ్డి పాల్గొన్నారు.