వరంగల్ : గ్రేటర్ కార్పొరేషన్లో నిర్వహించి న వార్డు సభల్లో ప్రజాప్రతినిధులకు నిరసన సెగ తగిలింది. మంత్రి కొండా సురేఖతోపాటు పశ్చి మ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణికి చేదు అనుభవం ఎదురైంది. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రేటర్ పరిధిలోని 66 డివిజన్లలో వార్డు సభలు జరిగాయి. 12వ డివిజన్ దేశాయిపేట వార్డు సభలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, 29వ డివిజన్ రామన్నపేటలో వార్డు సభలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని మహిళలు నిలదీశారు. దేశాయిపేట వార్డు సభలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖను పలువురు మహిళలు నిలదీశారు. తాము ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నాయని, ఇంతవరకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓపిక పట్టాలమ్మా.. అని మంత్రి సురేఖ అనడంపై మహిళలు మండిపడ్డారు. మంత్రి సురేఖ వస్తున్నారన్న సమాచారంతో ప్రజలు పెద్దఎత్తున సభకు హాజరై, తమ సమస్యలు చెప్పుకొనే ప్రయత్నం చేసినా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి వద్దకు వెళ్లనీయలేదు. ప్రజలు ఇచ్చే వినతి పత్రాలు తీసుకోకుండానే మంత్రి వార్డు సభ నుంచి వెళ్లిపోయారు. ఇలా వచ్చి అలా వెళ్లడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 29వ డివిజన్ రామన్నపేట వార్డు సభలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని మహిళలు నిలదీశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని, భర్త చనిపోయినా పింఛన్ రావడం లేదని ఓ మహిళ ఎమ్మెల్యేను నిలదీసింది. వరద సహాయం అందరికీ ఇచ్చామని చెప్పిన ఎమ్మెల్యేను స్థానిక మహిళలు ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు.
బంగ్లాలో ఉన్న వారికి ఇచ్చారని, మూడు రోజులు వరద నీటిలో ఉన్న వారకి సహాయం అందలేదన్నారు. కాగా, గ్రామసభలో నిలదీసిన మహిళపై ఎమ్మెల్యే నాయిని అసహనం వ్యక్తం చేశారు. వరద సహాయం అందలేదు.. పింఛన్ రావడం లేదని ప్రశ్నిస్తే ‘ఉండమ్మా.. ఎవ్వరో చెప్పింది ఇక్కడ చెప్పడం కాదు. దరఖాస్తు చేసుకున్న రసీదు ఉంటే పట్టుకొని రా’ అంటూ ఆయన అసహనంతో ముక్తసరి సమాధానం చెబుతూ వెళ్లిపోయారు. ఎమ్మెల్యే తీరుపై గ్రామసభ ముగిశాక మహిళలు శాపనార్థాలు పెట్టుకుంటూ ఇండ్లకు వెళ్లిపోయారు. మళ్లీ ఓట్లకు వచ్చినప్పుడు సంగతి చెబుతాం.. అంటూ ఆవేశంతో తిట్ల పురాణం అందుకున్నారు.