హనుమకొండ, జనవరి8: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం రంగవల్లుల పోటీలు నిర్వహించగా, మహిళలు కాంగ్రెస్ హామీలను ప్రశ్నిస్తూ వినూత్నంగా ముగ్గులు వేశారు. ప్రతి ముగ్గులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘వడ్లకు బోనస్ కట్.. రైతులకు రైతుబంధు ఏదీ?.. కౌలు రైతులకు భరోసా లేదే.. తులం బంగారం, సూటీలు, రూ.2500 ఎప్పుడిస్తారని ముగ్గులు వేసి మరీ ప్రశ్నించారు. ఈ పోటీల్లో 4వ డివిజన్‌కి చెందిన ఎం కల్పన మొదటి, రెండు, మూడో స్థానాల్లో 49, 54వ డివిజన్లకు చెందిన పీ పర్ణిక, ఏ మానస నిలవగా, ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ పాల్గొని బహుమతులు అందజేశారు.
అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వీ లవ్ కేటీఆర్, వీ ఆర్ విత్ కేటీఆర్, కాంగ్రెస్ 420 హామీలు, ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని బెలూ న్లు, పతంగులపై రాసి ఎగురవేశారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. హామీలు మరిచిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు గాయబ్ అయ్యాయని.. 420 హామీలు వట్టి మాటలే అని రుజువైందన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో విధ్వంసం, పోలీసుల పాలన సాగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నడుస్తుంది ప్రజాపాలన కాదని, ప్రతీకార పాలన అన్నారు.
కేసీఆర్ మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్ప వారికి చేసిందేమిటని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ రోజు రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి రైతు డిక్లరేషన్ బోగస్ అయ్యిందని ఆరోపించారు. అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయడం లేదని, రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. హైదరాబాద్ కీర్తిని పెంచే ప్రయత్నంలో ఫార్ములా ఈ రేస్‌ను నిర్వహించారని, ప్రభుత్వ అ కౌంట్ నుంచి నిర్వహణ సంస్థకు నగదు పంపిణీలో ఎకడా కేటీ ఆర్ జోక్యం లేనప్పుడు అవినీతి ఎలా అవుతుందన్నారు.
ప్రశ్నిస్తూ, నిలదీస్తున్నందుకే కేసులు పెడుతున్నారని, గతంలో పలు అంశాల్లో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తామని మంత్రులు అనడం వారి కుట్రలకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆపమని, కేటీఆర్‌కు అండగా బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమిస్తాయని దాస్యం స్పష్టం చేశారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజక వర్గం కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్పొరేటర్ చెన్నం మధు, బొండు అశోక్ యాదవ్, లోహిత రాజు, రజిత, జ్యోతి, పోలపల్లి రామ్మూర్తి, జోరిక రమేశ్, జానకీరాములు, రఘు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.