Woman Murder | గీసుగొండ జూన్ 09: ఖిలా వరంగల్ మండలం గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్తంభంపల్లి గ్రామంలో పోచన స్వరూప (65) అనే వృద్ధురాలిని ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచన స్వరూపకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కూతుళ్లకు వివాహం కాగా అత్తారింటిలో ఉంటున్నారు. కుమారుడు రమేష్ హనుమకొండలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. రమేష్ ఆరు నెలల క్రితం వరకు స్తంభంపల్లి గ్రామంలోనే తల్లి, భార్యాపిల్లలతో కలిసి నివసిస్తూ రోజు హనుమకొండకు వెళ్లి విధులకు హాజరయ్యేవాడు. ఇటీవల ఆరోగ్యం సహకరించకపోవడంతో హన్మకొండలో భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.
దీంతో స్వరూప ఒక్కరే గ్రామంలోని సొంతింట్లో ఉంటుంది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు స్వరూప ఇంట్లో ప్రవేశించి ఆమెను ఇనుప వస్తువులతో తలపై మోదీ హతమార్చిన ఆనవాళ్లు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు బంగారం కోసం హతమార్చారా..? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. ఆదివారం రాత్రి ఘటనాస్థలాన్ని ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్., మామునూరు ఏసీపీ వెంకటేష్ పరిశీలించి వివరాలు సేకరించారు. రాత్రి మృతదేహంను ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.