భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జవహర్‌నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉండే తాడికొండ సమ్మక్క అంబేద్కర్ సెంటర్లో పండ్ల దుకాణం నడిపేది. భర్త కొన్నేళ్ల క్రితమే కాలం చేయగా, కూతురు కల్పనను గణపురం మండలం పరశురాంపల్లికి చెందిన గట్టు కరుణాకర్‌తో పెళ్లి చేసిం ది. కుమారులు అరవింద్, అభిరాంతో కలిసి పండ్ల వ్యాపారం చేసుకుంటూ బతుకీడుస్తోంది. అయితే ఇల్లు, భూమి జాగ లేదని డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పించాలని గతంలో అధికారులు, నాయకులను వేడుకుంది. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీకే-5 ఇైంక్లెన్ వద్ద కొత్త గా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో సమ్మక్కకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఇల్లు కేటాయించారు.
11వ బ్లాకులో ఇల్లు కేటాయింపు జరుగగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తయారు చేసిన జాబితాను పూర్తిగా మార్చేశారు. కొత్త జాబితా తయారు చేయడంపై సమ్మక్కతో పాటు ఇతర లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. డబుల్ ఇండ్ల వద్ద ధర్నాలు, వంటా వార్పు కార్యక్రమాలు చేశా రు. తన పేరును కాంగ్రెస్ నాయకులు తొలగించారని తెలుసుకున్న సమ్మక్క.. ఎమ్మెల్యే సహా కౌన్సిలర్లందరి చుట్టూ తిరుగుతుందని, ఈక్రమంలో అనారోగ్యానికి గురైందని సమ్మక్క కుమారుడు అరవింద్ విలేకరులకు తెలిపారు. తమకు ఎక్కడ కూడా గుం ట భూమి లేదని, ఉండేందుకు ఇల్లూ లేదని, అయి నా తమకు వచ్చిన ఇంటిని రాకుండా చేస్తున్నారని, ఈ విషయమై రోజూ ఇంట్లో చెప్పుకుంటూ ఏడ్చేదని అన్నాడు.
అయితే ధర్నాలో పాల్గొన్నందుకే ఇల్లు రాకుండా చేశారని పదే పదే చెప్పేదని అరవింద్ అన్నాడు. అన్నం తినకుండా రోజూ కుంగిపోయేదని ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆదివారం రాత్రి హాస్పిటల్‌కు తీసుకెళ్లామని, చికిత్స పొందుతూనే సోమవారం మృతి చెందిందన్నాడు. మృతదేహాన్ని కూడా ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియని పరిస్థితి దాపురించిందని, అద్దె ఇంటి వారు నిరాకరించడంతో తమ సోదరి ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందంటూ విలపించాడు. భూపాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీశ్‌రెడ్డి, ఎమ్మార్పీస్ జిల్లా అధ్యక్షులు అంబాల చంద్రమౌళి తదితరులు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలు నిర్వహించారు.
పేదలకు పంచే ఇండ్లలో రాజకీయాలు వద్దు. రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల జాబితా తయారు చేయాలి. కానీ ఇక్కడ అలా జరుగడం లేదు. చాలామంది దళారులు తయారయ్యారు. బీఆర్ఎస్ హయాంలోనే జాబితా తయారు చేసి పంపిణీ చేశాం. కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా మళ్లీ లబ్ధిదారుల ఎంపిక ఎలా చేస్తారు. ఈక్రమంలోనే సమ్మక్క మనోవేదనతో అనారోగ్యానికి గురై మృతిచెందింది. ఆమె చాలా నిరుపేద మహిళ.
– గండ్ర హరీశ్‌రెడ్డి,
సమ్మక్క మృతి వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డబుల్ బెడ్రూం ఇండ్ల జాబితాలో సమ్మక్క పేరు చేర్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై కొందరు అధికార పార్టీ నాయకులు మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమ్మక్క పేరు చేర్చి గతంలో తయారు చేసిన జాబితాలో ఆమె పేరు ఉంది అని చెబుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీకే-5 ఇైంక్లెన్ సమీపంలో 416 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించగా లబ్ధిదారుల లిస్టును ఫైనల్ చేసి కొందరికి పట్టాలు అప్పగించింది. అప్పటికే అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీ ఆగిపోయింది. కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ లిస్టు తయారు చేసి లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇటీవల మంత్రులతో కొందరికి హక్కు పత్రాలు ఇప్పించి మళ్లీ పెండింగ్‌లో పెట్టారు.