కాజీపేట, జనవరి 21 : ప్రజల ఆకాంక్ష మేరకు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి అంకిత భావంతో పని చేస్తానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాజీపేట 62వ డివిజన్ రహ్మత్‌నగర్ చోటా మసీద్ సమీపంలో కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ రూ.50 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 62వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాన్నారు. అంతకు ముందు 61వ డివిజన్ పరిధిలోని ఫాతిమానగర్‌లో ఏర్పాటు చేసిన ఫాతిమా మల్టీ స్పెషాలిటీ దవాఖానను ప్రారంభించారు. అలాగే, సిదార్ధనగర్ బాబు క్యాంపునకు చెందిన పెండ్యాల మౌనికకు సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ కాపీ అందజేశారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ కార్పొరేటర్ సుంచు అశోక్ పాల్గొన్నారు.
హనుమకొండ సిటీ : పద్మశాలీలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. పెద్దమ్మగడ్డ రోడ్డులోని పద్మశాలి భవన్లో పద్మశాలి సంక్షేమ పరపతి సంఘం ఆత్మీయ సమ్మేళనం బత్తుల రమేశ్ బాబు అధ్యక్షతన జరిగింది. భక్త మారండేయ ఆలయానికి 500 గజాల స్థలం ఇప్పించి, హనుమకొండ చౌరస్తాలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. బాపూజీ విగ్రహ ప్రతిష్ఠాపనకు తన వంతుగా రూ.లక్ష సాయం అందజేస్తానని రమేశ్ బాబు చెప్పారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి గుర్రపు రమేశ్, కోశాధికారి మహేందర్, ఉపాధ్యక్షులు నరేందర్, రాజయ్య, సత్తయ్య పాల్గొన్నారు.