ఏటూరునాగారం, డిసెంబర్ 24: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం భూపతిపూర్ అటవీ ప్రాంతంలో అలుగులను వేటాడుతున్న నలుగురిని అటవీశాఖాధికారులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక అటవీ శాఖ డివిజనల్ అధికారి రమేశ్ వివరాలు వెల్లడించారు. అటవీ ప్రాంతంలో అలుగులను అక్రమంగా వేటాడుతున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు భూపతిపూర్, కమాన్పల్లి పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
అలుగులను వేటాడి వ్యాపారం చేస్తున్న భూపతిపూర్కు చెందిన కోరం నాగయ్య, కోరం పెంటయ్య, కోరం కృష్ణమూర్తి, భూపాలపల్లికి చెందిన వ్యాపారి చిడం రవిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో నాగయ్య రెండు అలుగులను పట్టుకుని ఒకటి మంచిర్యాలలో అమ్ముతుండగా అటవీ శాఖాధికారులు స్వాధీనం చేసుకోగా, రెండోది ఇప్పుడు పట్టుకున్నారు. అంతేకాకుండా గొడ్డలి, కత్తి, వంట పాత్రలు స్వాధీనం చేసుకున్నారు. కోరం పెంటయ్య, కోరం కృష్ణమూర్తిలు తల్లి, పిల్లను వేటాడి పట్టుకున్నారు.
ఇందులో పిల్లను అడవిలోనే వదిలి, తల్లిని మాత్రం చంపేసి తిన్నారు. భూపాలపల్లికి చెందిన పెద్ద వ్యాపారి దీని వెనుక ఉన్నాడని, అతడికి కాలు విరిగి వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడని, అతడిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎఫ్డీవో రమేశ్ తెలిపారు. అలుగు మాంసానికి అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉందని, అందుకే వీటిని వేటాడుతున్నారని పేర్కొన్నారు. నలుగురిపై వన్యప్రాణుల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి, ములుగు మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్లు అబ్దుల్ రెహమాన్, అప్సర్ ఉన్నీసా, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.