కేసముద్రం, ఏప్రిల్ 26 : అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున మక్కజొన్న చేన్లు దగ్ధమైన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు రైతులకు చెందిన 15 ఎకరాల మక్కజొన్న పంటలు కాలిబూడిదయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఈ యాసంగిలో తాళ్లపూసపల్లిలో రైతులు దొంతరబొయిన కొమురయ్య మూడు ఎకరాలు, సురేశ్ రెండు ఎకరాలు, ఐలయ్య మూడు ఎకరాలు, పుణ్యపుర్తి ఐలయ్య నాలుగు ఎకరాల్లో మక్కజొన్న సాగు చేశారు. ఎకరానికి సుమారు రూ.55 వేల చొప్పున పెట్టుబడి పెట్టారు.
పంట ఏపుగా పెరిగి చేతికి అందడంతో వారం రోజుల క్రితం కూలీలతో పంటను కోయించారు. మక్కజొన్న కంకులను చేనులోనే కుప్పలుగా పోశారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రమాదవశాత్తు ఆదివారం మధ్యాహ్నం నిప్పు అంటుకోవడంతో నిమిషాల వ్యవధిలోనే 15 ఎకరాలకు వ్యాపించింది. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నిం చేసినా అదుపులోకి రాలేదు. అగ్ని మాపక కేంద్రానికి సమాచారం అందించారు. దీంతో అగ్ని మాపక సిబ్బంది వాటర్ట్యాంకర్తో వచ్చే సరికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.
ఎకరానికి సుమారు 40 క్వింటాళ్లకు పైబడి దిగుబడి వచ్చే అవకాశం ఉందని బాధిత రైతులు తెలిపారు. చేతికి అందివచ్చే సమయంలో మక్కజొన్న పంటలు దగ్ధ్దమవడంతో రైతుల రెక్కల కష్టంతోపాటు పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు ఏర్పడి ఈ దుర్ఘటన జరిగిందని పలువురు రైతులు బావిస్తున్నారు.