Kiran Abbavaram | యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన తాజా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ను మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మాతలు ఎస్కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించారు. జూలై 24న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకునే వసూళ్లను నమోదు చేస్తోంది.సినిమా విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్‌కు యువ హీరో అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్రబృందాన్ని అభినందించిన ఆయన, సినిమా విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు కిరణ్ అబ్బవరం ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘చెన్నై లవ్ స్టోరీ’ విజయం సాధించిన తర్వాత సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ వైరల్ అయ్యాయి. పీఆర్ టీమ్ ద్వారా సినిమాకు హిట్ టాక్ తీసుకొచ్చారని, థియేటర్ టికెట్లు కొనిపించి కలెక్షన్లు పెంచారనే ప్రచారం జరుగుతుండటంపై ఓ రిపోర్టర్ ప్రశ్నించగా, కిరణ్ అబ్బవరం నేరుగా స్పందించారు.ఇలాంటి ప్రశ్నలను దాటవేయడం కంటే సమాధానం చెప్పడం మంచిది. పీఆర్ టీమ్‌లతోనే హిట్లు వస్తే ఇండస్ట్రీలో ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఎంత ప్రచారం చేసినా ప్రేక్షకులు ఆదరించకపోతే సినిమా విజయం సాధించదు. చివరికి తీర్పు చెప్పేది ప్రేక్షకులే. వారి అభిరుచిని ఎప్పుడూ గౌరవించాలి అని అన్నారు. సినిమాకు వస్తున్న స్పందన గురించి మాట్లాడుతూ కిరణ్, చెన్నై లవ్ స్టోరీని చూసేందుకు థియేటర్లకు దాదాపు 60 శాతం ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారు. వాళ్లలో చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండరు. సినిమా బాగుందని తెలిసి, మౌత్ టాక్ ఆధారంగానే థియేటర్లకు వస్తున్నారు. ఒక సినిమా విజయాన్ని కేవలం పీఆర్‌తో ముడిపెట్టడం సరైన విధానం కాదు అని తెలిపారు.
నా మొదటి సినిమా నుంచి ఇలాంటి ప్రచారాలు చూస్తూనే ఉన్నాను. కష్టపడి, నిజాయితీగా పని చేస్తే దానికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది. ఒకవేళ పీఆర్తోనే విజయాలు సాధించగలిగితే పెద్ద నిర్మాతలందరూ ప్రతి సినిమాను రూ.200 కోట్లు, రూ.300 కోట్లు వసూలు చేసేలా చేసేవారు. నా దగ్గర అందరికంటే తక్కువ డబ్బులే ఉన్నాయి. అందుకే ఆధారాలు లేకుండా పీఆర్ వల్లే హిట్ వచ్చిందని ప్రచారం చేయొద్దు అంటూ స్పష్టం చేశారు.సుమారు రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘చెన్నై లవ్ స్టోరీ’ విడుదలకు ముందే మంచి బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.15.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా, పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే దాదాపు రూ.3 కోట్లు రాబట్టింది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.12.3 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, తొలి వీకెండ్ ముగిసే సరికి సుమారు రూ.28.70 కోట్ల గ్రాస్ సాధించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.