వర్ధన్నపేట, మార్చి 8 : పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని ఇల్లంద గ్రామ శివారులోని లక్ష్మీ ఫంక్షన్హాల్లో జరిగిన మహిళా దినోత్సవానికి ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమంతో పాటు మహిళాభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. గత పాలకులు కాల్వలు తవ్వించినా చుక్కనీరు కూడా అందులో ప్రవహించలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలోని ప్రతి చెరువూ నీటితో కళకళలాడుతున్నదన్నారు. ఎస్సారెస్పీ ప్రధాన కాల్వలో 365 రోజులు నీరు ప్రవహిస్తున్నదన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. ఆసరా పింఛన్ల వయసును ప్రభుత్వం 5 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిందని తెలిపారు. అలాగే స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3 లక్షలు అందించనున్నదని తెలిపారు. పావలా వడ్డీ రుణాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు కోసం మహిళలకు రూ.187 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని వివరించారు.
కరీమాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళాబంధువని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం మామునూరులోని ఓ గార్డెన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందన్నారు. ఆడబిడ్డల సంక్షేమానికి, రక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అనంతరం పలువురు మహిళలను వారు సత్కరించారు.
రాయపర్తి : మానవ రూపంలోని దైవాలు మహిళలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం-మహిళా బంధు వేడుకలకు ఎంపీ దయాకర్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓర్పు, సహనం, ఓదార్పు, ప్రేమ, కరుణకు స్త్రీ మూర్తులు మారుపేర్లు అని అన్నారు. ఆడవాళ్లు లేని సమాజాన్ని ఊహించడం కష్టమని, స్త్రీ భాగస్వామ్యంతోనే సమాజం వేగవంతమైన అభివృద్ధిని సాదిస్తుందని వివరించారు. మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన షీ టీమ్స్ వ్యవస్థ ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపును సాధించిందన్నారు. అనంతరం స్త్రీ నిధి, వడ్డీలేని రుణాలు, కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. రాయపర్తి మండలాన్ని అభివృద్ధిలో అగ్రపథాన నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సర్పంచ్ గారె నర్సయ్య సారధ్యంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన వాణిజ్య సముదాయ భవనాలను ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్-గ్రామ పంచాయతీ భవన సముదాయాల ఆవరణలో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన మిషన్ భగీరథ నల్లాలను ప్రారంబించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మ న్ మార్నేని రవీందర్రావు, అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, డీపీవో నాగపురి స్వరూపారాణి, ఎంపీపీలు అన్నమనేని అప్పారావు, మార్నేని మధుమతి, కమల, జడ్పీటీసీలు మార్గం భిక్షపతి, సింగ్‌లాల్, గజ్జెలి శ్రీరాములు, రంగు కుమార్, డీఆర్డీవో సంపత్‌రావు, అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ లలితాయాదవ్, మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, పూస మధు, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో గుగులోత్ కిషన్‌నాయక్, పీఏసీఎస్ చైర్మన్లు రాజేశ్‌ఖన్నా, మనోజ్‌కుమార్, వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, కార్పొరేటర్ అరుణ, నాయకులు నోముల వెంకట్‌రెడ్డి, కంకణాల సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.