తొర్రూరు, జూలై 11 : మాలోత్ సురేశ్‌బాబు కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భరోసా ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం భోజ్యతండా పరిధి ఈదులకుంట తండాకు చెందిన గిరిజన యువకుడు మాలోత్ సురేశ్‌బాబును పోలీసులు చితకబాదారని తెలుసుకున్న ఆయన గురువారం సాయంత్రం అతడి ఇంటికి వెళ్లారు. సురేశ్ కుటుంబసభ్యులను కలిసి అన్ని విధాలా అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెస్తానని వారికి హామీ ఇచ్చారు. అక్కడినుంచే మహబూబాబాద్ ఎస్పీకు ఫోన్ చేశారు. సమగ్ర విచారణ జరుపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని దయాకర్‌రావు చెప్పారు.