నర్సంపేట, ఫిబ్రవరి 24 : దళిత బంధులో లబ్ధిదారులు ఆసక్తి ఉన్న యూనిట్నే నిర్వహించాలని కలెక్టర్ గోపి కోరారు. నర్సంపేటలో 100 మంది లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారుల అర్హతలు, కుటుంబ నేపథ్యం, ఆర్థిక స్థితిని బట్టి వారు కోరిన యూనిట్లను మంజూరు చేస్తామన్నారు. అందరూ ఒకే రకమైన యూనిట్ల కోసం దరఖాస్తు చేయొద్దన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న అవకాశాలను బట్టి యూనిట్లు పెట్టుకుంటే మేలు కలుగుతుందని తెలిపారు. లబ్ధిదారులు లైసెన్స్, రిజిస్ట్రేషన్, డాక్యుమెంటేషన్, ఇన్సూరెన్స్ సంబంధిత విషయాలు అధికారులు తెలుపుతారన్నారు. రెండో దఫాలో సుమారు రెండు వేల మందికి యూనిట్లు పంపిణీ చేస్తామన్నారు.
పైసా లంచం, పైరవీ లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ దళితబంధు అందిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. కాస్త ఆలస్యమైనా నియోజకవర్గంలోని 9300 కుటుంబాలకు విడుతల వారీగా అందిస్తామన్నారు. అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నారన్నారు. దళితబంధు పథకాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలు దళితులకు వారు ఏం చేశారో చెప్పాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, ఆర్డీవో పవన్‌కుమార్, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటిరజిని, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.