న్యూశాయంపేట, జూన్ 3 : తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను నెరవేరుస్తామని, అమరుల ఆశయ సాధన కోసం సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్క అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హంటర్‌రోడ్‌లోని డీ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేయగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులను సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ అమరుల కుటుంబాలను గౌరవించుకుందామని, వారికి సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఉద్యమకారులకు ఉద్యోగం, అమరవీరుల కుటుంబాలకు రూ.25వేల పెన్షన్ ఇస్తామని తెలిపారు. తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడిన తీరు, జరిగిన పరిణామాలను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, ఎంపీ పసునూరి దయాకర్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ వెంకటస్వామి, గండ్ర సత్యనారాయణరావు, యశస్వినీరెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్, కాజీపేట దర్గా పీఠాధిపతి, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూ పాషా, మేయర్ సుధారాణి, తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.