బయ్యారం , మే 19 : ‘పైసా అదనపు ఖర్చు లేకుం డా వచ్చిన బిల్లుతోనే నాణ్యతగా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం.. మీరు గృహ ప్రవేశం చేసుకుంటే చాలు..’ అంటూ ఓ కాంట్రాక్టర్ చెప్పిన మాటలు నమ్మిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నట్టేటా మునిగారు. ఆరు నెలలుగా ఇంటి నిర్మాణ పనులు నిలిచిపోయి గోస పడుతున్నారు. ఇల్లు వచ్చిందనే సంతోషం కంటే.., నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. మొదటి దశలో బయ్యారం మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లో 557 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి.
అయితే, ఓ కాంట్రాక్టర్ పైసా అదనపు ఖర్చు లేకుండా వచ్చిన బిల్లుతోనే ఇల్లు కట్టస్తానని నమ్మించడంతో ఏజెన్సీలోని రామచంద్రాపురం, బాలాజీపేట, గురిమళ్ల, కంబాలపల్లి, కొయ్యగూడెం, సుద్దరేవు, టేకులగూడెం, జగత్రావుపేట గ్రామాలకు చెందిన సుమారు 70 మంది పనులు అతడికి అప్పజెప్పారు. పది నెలల క్రితమే నిర్మాణ పనులు ప్రారంభించాడు. కాంట్రాక్టర్, లబ్ధిదారుల పేరుమీద సంయుక్తంగా బ్యాంకు ఖాతాలు తెరిచాడు. బెస్ లెవల్ నిర్మాణాలు పూర్తి కావడంతో మొదటి దశ బిల్లు ఇంటికి రూ.లక్ష చొప్పున మంజూరు కావడంతో కాంట్రాక్టర్ డ్రా చేసుకున్నాడు.
అనంతరం నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో ఆరు నెలలుగా నిలిచిపోయాయి. పనులు చేపట్టాలని కాంట్రాక్టర్కు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. సొంతంగా కట్టుకున్న వారి ఇండ్లు చివరి దశకు చేరాయని, తమ ఇండ్లు మాత్రం బేస్ లెవల్లోనే ఉన్నాయని, ఆర్థిక స్థోమత లేక గుత్తేదార్కు అప్పగిస్తే నట్టేటా ముంచాడని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఇంటి నిర్మాణాలు త్వరగా చేపట్టాలని సంబంధిత అధికారులు ఒత్తిడి తెస్తున్నారని వాపోతున్నారు. నిర్మాణాలు ప్రారంభించకుంటే నోటీసులు అందించేందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారు.
కొందరు లబ్ధిదారులు సొంతంగానే ఇంటి నిర్మాణం చేసుకుందామంటే బిల్లు గుత్తేదారు, లబ్ధిదారుల జాయింట్ ఖాతాలో పడే అవకాశం ఉండడంతో వెనకడుగు వేస్తున్నారు. కాంట్రాక్టర్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయక, సొంతంగా కట్టుకోలేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైందన్న ఆనందంతో కొందరు లబ్ధిదారులు పాత ఇంటిని కూల్చి, అక్కడే కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు. ప్రస్తుతం వారు అద్దె, చుట్టాల ఇండ్లలో తల దాచుకుంటుండగా, మరి కొందరు పక్కనే రేకులషెడ్ వేసుకొని నివాసముంటున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని, వర్షాలు వస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు కాంట్రాక్టర్కు అప్పగించే సమయంలో ప్రోత్సహించిన ప్రజాప్రతినిధులు పనులు మధ్యలో నిలిపివేసినా పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్ ఇండ్ల నిర్మాణాలు చేపట్టేలా చూడాలని కోరుతున్నారు.
నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించాం..
మొదటి దశలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లలో కొంత మంది లబ్ధిదారులు కాంట్రాక్టర్కు అప్పగిస్తూ ఒప్పందం చేసుకున్నారు. బేస్మెంట్ లెవల్ వరకు పూర్తి కావడంతో మొదటి బిల్లు కూడా మంజూరు చేశాం. నిర్మాణాలు మధ్యలోనే నిలిపివేశాడు. త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్, లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకొస్తున్నాం.
– ప్రియాంక ( ఏఈ ,హౌసి ంగ్ )
ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు..
మంజూరైన ఇందిరమ్మ ఇల్లును వచ్చిన బిల్లుతోనే పూర్తి చేసి ఇస్తామంటే కాంట్రాక్టర్ను నమ్మి పనులు అప్పగించాం. బేస్ లెవల్ వరకు పూర్తి చేసి, పనులు నిలిపి వేశాడు. ఆరు నెలల నుంచి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. మొదటి బిల్లు కూడా తీసుకున్నాడు. ఇంటి నిర్మాణం పూర్తి కాకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. సొంతంగా కట్టుకుందామంటే బ్యాంకు ఖాతా కాంట్రాక్టర్, మాకు జాయింట్లో ఉంది. ఇల్లు మంజూరైందన్న సంతోషమే లేదు. ఎప్పుడు పూర్తి చేస్తడో.. ఎప్పుడు ఇంట్లోకి వెళ్లాలో తెలియడం లేదు.
– ధనసరి సుధ (ఇందిరమ్మ లబ్ధిదారురాలు, కొత్తూరు)