ఖిలావరంగల్, డిసెంబర్ 23 : ‘మన ఊరు-మన బడి’ పనులను వచ్చే నెల 8 వరకు పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. శుక్రవారం ‘మన ఊరు-మన బడి’ పనుల పురోగతిపై కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలలకు కావలసిన ఫర్నిచర్, బోర్డులు, లైబ్రరీ, డ్యూయల్ డెస్, కిచెన్ షెడ్లు నిర్మాణ పనులు ఎంత వరకు పూర్తయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిల్లల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. దాతల కోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీవత్స కోట, అశ్విని తానాజీ వాకడే, జిల్లా విద్యాధికారి వాసంతి, డీఆర్డీవో సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.