హనుమకొండ, డిసెంబర్ 9 : కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి, ఆత్మ విశ్వాసాన్ని పుణికి పుచ్చుకొని కాంగ్రెస్ దుర్మార్గ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధ్దులు కావాలని శాసనమండలి ప్రతిపక్షనేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. దీక్షా దివస్‌లో భాగంగా 11 రోజులపాటు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలు చివరి రోజు మంగళవారం విజయ్ దివస్ కార్యక్రమానికి మధుసూదనాచారి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి, ఏకశిలా పార్కులోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలు చల్లారు. అనంతరం అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన 10 మంది విద్యార్థులను నగదు, శాలువా, మెమొంటో బహుకరించి అభినందించారు. తెలంగాణ ఉద్య మంలో గాంధీ టు గాంధీ పాదయాత్ర చేసిన డాక్టర్లు నాగేంద్రబాబు, శ్రీధర్ రాజు, జగదీశ్వర్ ప్రసాద్, మోహన్‌రావు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ మధుకర్‌ను శాలువా మెమొంటోతో సతరించారు. అనంతరం జరిగిన సమావేశంలో సిరికొండ మాట్లాడారు.
తెలంగాణ కోసం ఏ నాయకుడు ప్రాణ త్యాగానికి సిద్ధపడలేదని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ స్వరాష్ట్రాన్ని సాధించారన్నారు. తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ అని, తెలంగాణను, ఉద్యమాన్ని, నాయకత్వాన్ని అణచివేయాలని చూసిందన్నారు. అమరుల త్యాగం, సబ్బండ వర్గాల పోరాటంతోనే రాష్ట్రం సాధించామని తెలిపారు. కేసీఆర్ పదేండ్ల పాలనాలో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, విద్యుత్, తాగునీరు, సాగునీరు అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన నిలిపారన్నారు.
కాంగ్రెస్ పాలనలో అప్పులు పెరిగి, ఆదాయం పడిపోతున్నదని, సీఎం రేవంత్‌రెడ్డికి కౌంట్ డౌన్ సైతం ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు చెన్నం మధు, బొంగు అశోక్, సోదా కిరణ్, నర్సింగ్, ఇమ్మడి లోహిత, నాయకులు తాళ్లపల్లి జనార్దన్‌గౌడ్, పులి రజనీకాంత్, నయీమొద్దీన్, కుసుమ లక్ష్మీనారాయణ, జానకిరాములు, బుద్దె వెంకన్న, జోరిక రమేశ్, సల్వాజి రవీందర్రావు, పెరుకారి శ్రీధర్‌రావు, రజిత, మహేందర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో విధ్వంసం తప్ప వికాసం లేదు
-ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
కాంగ్రెస్ పాలనలో విధ్వంసం తప్ప వికాసం కనిపించడం లేదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. గతంలో పదవుల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకుంటే కేసీఆర్ పదవులకు రాజీనామాతో ఉద్యమాన్ని చేపట్టారన్నారు. డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో మహాన్నతమైన రోజు, కేసీఆర్ పోరాటానికి ఫలితం, 60 ఏండ్ల కల సాకారమైన రోజు, ఈ రోజును స్మరించుకోవాలన్నారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి చేసింది ఇళ్లు కూలగొట్టడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఉద్యమ గర్భం నుంచి పుట్టిన తెలంగాణ తల్లి నాటి విగ్రహమైతే, రేవంత్‌రెడ్డి పైశాచికత్వం నుంచి పుట్టుకొచ్చింది నేటి తెలంగాణ తల్లి విగ్రహం అన్నారు. విజన్ 2047 పేరుతో సీఎం కొత్తగా ఎత్తుకున్నారని, ఫ్యూచర్ సిటీలో నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ కాదని, లోకల్ సమ్మిట్ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో రోడ్‌కు ట్రంప్ పేరు పెడుతానని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
కేసీఆర్‌ను సీఎం చేసేందుకు ముందుకు సాగుదాం
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేసేందుకు ముందుకు సాగాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీది ప్రజా పాలన కాదు.. ప్రతీకారపాలన అన్నారు. కేసీఆర్ పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాలనే 11రోజుల పాటు దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయం జనతా గ్యారెజీలా మారి, పేదల పక్షాన పోరాడుతుందన్నారు.