వరంగల్, మార్చి 18(నమస్తేతెలంగాణ) : వరంగల్‌ను హెల్త్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇక్కడ సెంట్రల్ జైలు స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించనుంది. అరవై ఎకరాల్లో 24 అంతస్తులతో రెండు వేల పడకల సామర్థ్యంతో ఈ దవాఖాన నిర్మాణం కోసం గత జూన్ 21న రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. అత్యాధునిక వసతులతో నిర్మించే ఈ హాస్పిటల్లో 35 విభాగాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, దేశంలో ఇదే అతి పెద్ద హాస్పిటల్ కానుందని ఆయన చెప్పారు. వైద్యం కోసం వరంగల్ ప్రజలు హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండా దీన్ని ఇక్కడ నిర్మించేందుకు నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. హాస్పిటల్ నిర్మాణం కోసం రూ.1,100 కోట్లతో పాలనపరమైన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిం ది. నిర్మాణ బాధ్యతలను ఆర్అండ్బీ శాఖకు అప్పగించింది.
ఆర్అండ్బీ ఇంజినీర్లు అత్యవసర వైద్య సేవల కోసం ఎయిర్ అంబులెన్స్(హెలికాప్టర్)ను వినియోగించేందుకు అనువుగా 24 అంతస్తుల భవనంపై హెలిపాడ్ ఉండేలా డిజైన్ రూపొందించారు. పరిశీలించిన ప్రభుత్వం సివిల్ పనులకు రూ.509, మంచినీరు, పా రిశుధ్యం కోసం రూ.20.36కోట్లు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్కు రూ.182.18కోట్లు, వైద్య పరికరాల కు రూ.105కోట్లు, అనుబంధ పనులకు రూ.54.28కోట్లు, చట్టబద్ధమైన పనులు, పన్నులకు రూ.229.18 కోట్లు కేటాయించింది. ఆర్అండ్బీ ఇంజినీర్లు ప్రభుత్వం నుంచి టెక్నికల్ అనుమతులు కూడా తీసుకుని గత డిసెంబర్లో టెండర్ల ప్రక్రియ చేపట్టారు. టెండర్ల దాఖలు గడువు గత ఫిబ్రవరి 28న ముగిసింది. అదేరోజు ఆర్అండ్బీ ఇంజినీర్లు టెక్నికల్ బిడ్ తెరిచారు. ఈ నెల 5న ప్రైస్ బిడ్ ఓపెన్ చేశారు. టెండర్లలో పాల్గొన్న నిర్మాణ సంస్థల్లో ఎల్-వన్‌గా నిలిచిన ఎల్అండ్టీ వరంగల్ మెగా హాస్పిటల్ నిర్మాణ పనులను దక్కించుకుంది.
ఎల్అండ్టీ ప్రతినిధుల సందర్శన
టెండర్ పొందిన ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులు శనివారం నుంచి కాలపరిమితి అమల్లోకి రానున్న దృష్ట్యా శుక్రవారం ఆర్అండ్బీ ఇంజినీర్లతో కలిసి మెగా హాస్పిటల్ నిర్మించే సెంట్రల్ జైలు స్థలాన్ని సందర్శించారు. వీరిలో ఎల్అండ్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బూతలింగం, ప్రతినిధి రమేశ్, ఆర్అండ్బీ వరంగల్ పర్యవేక్షక ఇంజినీర్(ఎస్ఈ) నాగేందర్రావు, జిల్లా కార్యనిర్వాహక ఇంజినీర్(ఈఈ) జితేందర్‌రెడ్డి, ఇంజినీర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. వీరు మెగా హాస్పిటల్ నిర్మించే 16.50 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని పరిశీలించారు. భవన నిర్మాణం కోసం ఎల్అండ్టీ ఇంజినీర్లు సుమారు 70 నుంచి 100 మంది ఉంటారు. వీరితో పాటు వివిధ విభాగాల ఇన్చార్జిలు, కార్యాలయ సిబ్బందికి వసతి కోసం జైలు స్థలంలో ఉన్న క్వార్టర్లను ఎల్అండ్టీ ప్రతినిధులు ఆర్అండ్బీ ఇంజినీర్లతో కలిసి పరిశీలించారు. ఈ స్థలంలో సెంట్రల్ జైలు అధికారులు, సిబ్బంది నివసించిన క్వార్టర్లు 23 ఉన్నాయి.
ప్రస్తుతం ఇవి ఆర్అండ్బీ శాఖ ఆధీనంలో ఉన్నాయి. ఎల్అండ్టీ ఇంజినీర్లు, ప్రతినిధులు, కార్యాలయం నిర్వహణ, సిబ్బంది కోసం సదరు క్వార్టర్లను పరిశీలించారు. వీటి పునర్నిర్మాణ పనులు చేపట్టి వినియోగించేందుకు ఏర్పాట్లు కూడా చేపట్టారు. ఇక్కడ దవాఖాన నిర్మాణానికి వందల సంఖ్యలో పనిచేసే లేబర్ కోసం తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హాస్పిటల్ నిర్మాణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఆర్అండ్బీ కార్యాలయం పనిచేయనుంది. పదిహేను రోజుల్లోగా ఈ క్వార్టర్ల పునర్నిర్మాణం, లేబర్ కోసం తాత్కాలిక నివాసాల ఏర్పాటు, ఇతర వసతులను సమకూర్చుకుని హాస్పిటల్ పనులు ప్రారంభిస్తామని ఎల్అండ్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బూతలింగం చెప్పారు. పద్దెనిమిది నెలల్లో దవాఖాన నిర్మాణం పూర్తి చేయడం తమ సంస్థ లక్ష్యమని తెలిపారు. ఆర్అండ్బీ ఎస్ఈ నాగేందర్రావు మాట్లాడుతూ.. వచ్చే వానకాలం ప్రారంభమయ్యేలోగా హాస్పిటల్ భవన నిర్మాణం గ్రౌండ్ లెవల్ వరకు వస్తుందని వెల్లడించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు మొదలైనట్లేనని, శనివారం నుంచి ఎల్అండ్టీ ప్రతినిధులు, ఇంజినీర్లు, సిబ్బంది ఇక్కడ పని స్థలంలో దిగుతారని ఆయన చెప్పారు.
16.50లక్షల చదరపు అడుగుల్లో భవనం..
టెండర్ల ప్రక్రియ మొదలుకావడానికి ముందే ఆర్అండ్బీ ఇంజినీర్లు మహా హాస్పిటల్ నిర్మించే స్థలం లో మట్టి నమూనాలు సేకరించారు. వేర్వేరుగా ఐదు పాయింట్లను గుర్తించి 30 మీటర్ల లోతు వరకు డ్రి ల్లింగ్ వేశారు. ఆ తర్వాత ఈ హాస్పిటల్ నిర్మాణ పను లు పొందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ కూ డా కొద్ది రోజుల క్రితం ఇక్కడ మట్టి నమూనాలు సేకరించింది. 16.50 లక్షల చదరపు అడుగుల స్థలంలో 24 అంతస్తులతో రెండు వేల పడకల సామర్థ్యంతో కూడిన హాస్పిటల్ నిర్మాణం జరుగనుంది. ఈ స్థలం లో ఐదు పాయింట్లను గుర్తించి ఎల్అండ్డీ సంస్థ సుమారు 20 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ వేసింది. ఎల్అండ్టీకి ఆర్అండ్బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి శనివారం లెటర్ ఆఫ్ ఆక్సెప్టెన్సీ(ఎల్వోఏ) అం దజేయనున్నారు. దీంతో ఈ నెల 19 నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ కాలపరిమితి ఒప్పం దం అమల్లోకి రానుంది. మహా దవాఖానను 18నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన 2023 సెప్టెంబర్ వరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మా ణం పూర్తి కానుంది. ఎల్అండ్టీకి టెండర్ దక్కినందున ప్రభుత్వం నిర్దేశించిన పద్దెనిమిది నెలల కాలపరిమితిలోపే ఈ హాస్పిటల్ నిర్మాణం జరిగే అవకాశం ఉంది. వానకాలం మొదలయ్యేలోగా 24 అంతస్తుల భవనం పౌండేషన్ అంటే గ్రౌండ్ లెవల్ పనులు పూర్తవుతాయని ఆర్అండ్బీ ఇంజినీర్లు చెబుతున్నారు.