నర్సంపేట, మార్చి 18: వినాశకర విధానాలతో అన్నంపెట్టే అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఏఐకేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పెద్దారపు రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. నర్సంపేటలో శుక్రవారం ఏఐకేఎఫ్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్లో ఏప్రిల్ 7, 8, 9వ తేదీల్లో జరిగే రాష్ట్ర తొలి మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని ప్రకటించి, ఆచరణలో రైతులను దివాలా తీసే విధానాలకు పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు దేశీయ వ్యవసాయాన్ని కట్టబెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారని గుర్తుచేశారు. ఐక్య రైతు ఉద్యమ హెచ్చరికతో వెనక్కి తగ్గినట్లు తెలిపారు. అయినా రైతాంగానికి మోదీ ప్రభుత్వం నుంచి ప్రమాదం పొంచి ఉందన్నారు. అచ్చే దిన్ అంటూనే రైతులను చంపే విధానాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చరిత్రాత్మకమైన రైతాంగ ఉద్యమానికి ఇచ్చిన హామీలను సైతం విస్మరించారని, ఇలాంటి పరిస్థితిలో మరోసారి రైతాంగ ఉద్యమం రుచిని బీజేపీ ప్రభుత్వానికి చూపించక తప్పదని హెచ్చరించారు. ఇందుకోసం రైతాంగం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు జిల్లా బాధ్యులు కుసుంబ బాబురావు, నాగెల్లి కొమురయ్య, ఎస్ మల్లికార్జున్, కే సదానందం, చొల్లేటి సీతారాములు, ఏ రమేశ్, గటిక జమున, జల్లి బుచ్చయ్య పాల్గొన్నారు.