నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 18: జిల్లాలో హోలీ పండుగ శుక్రవారం అంబరాన్నంటింది. చిన్నాపెద్దా తేడాలేకుండా రంగులు చల్లుకోగా ఊరూవాడా వర్ణశోభితమైంది. ముఖ్యంగా యువతీయువకులు సంబురాల్లో మునిగి తేలారు. దోస్తులతో కలిసి బైక్‌లపై తిరుగుతూ రంగులు పూసుకుంటూ సందడి చేశారు. కూడళ్ల వద్ద నృత్యాలతో హోరెత్తించారు. ఇరుగుపొరుగు ఇండ్ల వాళ్లు అంతా కలిసి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. వేడుకల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని స్థానికుల్లో ఉత్సాహం నింపారు. హనుమకొండలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి, వరంగల్‌లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కలెక్టర్ బీ గోపి, మహబూబాబాద్‌లో ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, శంకర్‌నాయక్, కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్, జయశంకర్ భూపాలపల్లిలో కలెక్టర్ భవేశ్‌మిశ్రా, ఎస్పీ సురేందర్‌రెడ్డి, ములుగులో ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, జనగామలో కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, డీసీపీ సీతారాం తదితరులు తమ తమ క్యాంప్ కార్యాలయాల్లో హోలీ వేడుకల్లో పాల్గొనగా ఉద్యోగులు, సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు.