నయీంనగర్, మార్చి 18 : కాకతీయ యూనివర్సిటీ మైదానంలో సౌత్ జోన్ ఖోఖో పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. కేయూ జట్టు విజయపథంలో దూసుకెళ్తోంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 30 జట్లు ఆడగా అందులో 15 జట్లు గెలుపొందాయి. రాష్ట్రం నుంచి ఉస్మానియా, శాతవాహన, పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాంధీ, కాకతీయ యూనివర్సిటీ జట్లు గురువారం మొదటి రోజు ఆడగా ఇందులో నాలుగు జట్లు ఓడిపోయాయి. మరో జట్టు ఉస్మానియా యూనివర్సిటీ రెండో రోజు ఉదయం గెలిచి, సాయంత్రం కేరళ త్రివేండ్రం జట్టు చేతిలో ఓడిపోయింది. కాకతీయ యూనివర్సిటీ జట్టు మాత్రం ఉదయం, సాయంత్రం ఆడి తమ ప్రతిభ కనబరిచింది.
రెండో రోజు ఆడిన జట్లు..
ఓయూ హైదరాబాద్ వర్సెస్ మదర్ థెరిస్సా కొడైకెనాల్ జట్లు తలపడి 9-4 స్కోర్ సాధించాయి. మధురై కామరాజు మధురై వర్సెస్ కన్నూర్ యూనివర్సిటీ కన్నూర్ 12-6, కేరళ త్రివేండ్రం యూనివర్సిటీ వర్సెస్ పెరియార్ యూనివర్సిటీ సెలాం 9-8, బెంగళూరు నార్త్ యూనివర్సిటీ కోలార్ వర్సెస్ ఎస్కేడీయూ అనంతపురం 13-3, మంగళూరు యూనివర్సిటీ వర్సెస్ భారతీర్ యూనివర్సిటీ తమిళనాడు 18-7, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వర్సెస్ అలగప్ప కరైకోడి 9-6, తుంకూర్ యూనివర్సిటీ తుంకూర్ వర్సెస్ తిరువళ్లువార్ వేలూరు 5-4, కేయూ వరంగల్ వర్సెస్ మాండ్యా యూనివర్సిటీ కర్నాటక 14-7, ఎంఎస్యూ తిరునల్వేలి వర్సెస్ దేవంగర్ యూనివర్సిటీ కర్నాటక 10-6, యూనివర్సిటీ కేరళ త్రివేండ్రం వర్సెస్ బెంగళూరు నార్త్ యూనివర్సిటీ కోలార్ 10-1, ఓయూ హైదరాబాద్ వర్సెస్ కర్నాటక యూనివర్సిటీ ధర్వాద్ 12-8, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వర్సెస్ మధురై కామరాజు 11-9, యూనివర్సిటీ కేరళ త్రివేండ్రం వర్సెస్ ఓయూ హైదరాబాద్ 15-6, మంగళూరు యూనివర్సిటీ మంగళగంగోత్రి వర్సెస్ ఏంఎస్యూ తిరునల్వేలి 13-2, కాకతీయ యూనివర్సిటీ వరంగల్ వర్సెస్ తుంకూర్ యూనివర్సిటీ తుంకూర్ జట్లు ఆడి 10-7 స్కోర్ సాధించాయి. విజేతలకు కేయూ క్రీడా కార్యదర్శి టీ సవితాజ్యోత్స్నతో పాటు పలువురు అభినందించారు. శనివారం ఉదయం లీగ్ పోటీలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
కేయూ విజయం సాధిస్తుంది..
కేయూ జట్టు బాగా ఆడుతోంది. నిరుత్సాహ పడితే విజయం సాధించలేం. అది కేయూ క్రీడాకారులకు బాగా తెలుసు. ఎక్కువగా కేయూలో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన క్రీడాకారులే ఉన్నారు. ఎలా ముందుకు పోవాలో వారికి బాగా తెలుసు. ఇంతటి చక్కటి టీంను ఎన్నడూ చూడలేదు. కేయూ జట్టు అంటేనే విజయం అని తెలుస్తుంది.
-తిరుమల్, కోచ్