గీసుగొండ, మార్చి 18 : మండలంలోని కొమ్మాల శ్రీలక్ష్మీనర్సింహస్వామి జాతరకు భక్తజనం పోటెత్తారు. హోలీ వేడుకల అనంతరం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఎడ్లబండ్లపై, ప్రైవేట్ వాహనాల్లో శుక్రవారం తరలివచ్చారు. ఒంటె, ఏనుగు, గుర్రం, మేక తదితర ప్రభ బండ్లను అందంగా ముస్తాబు చేసుకుని కోలాటాలు, లంబాడీ నృత్యాల నడుమ స్వామి వారికి మొక్కలు చెల్లించుకున్నారు. అర్చకులు స్వామి వారికి పూర్ణాహుతి, ఇతర ప్రత్యేక పూజల అనంతరం ఆలయం గుట్ట చుట్టూ ఎడ్లబండ్ల తిరిగే ఘట్టం అత్యంత వైభవంగా జరిగింది. భక్తుల గోవింద నామస్మరణలతో ఆ ప్రాంత మంతా మార్మోగింది. దర్శనం అనంతరం వంటలు చేసుకుని భోజనాలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు. కాగా, వరంగల్-నర్సంపేట మార్గంలో ఎడ్లబండ్ల సందడి కనిపించింది. రద్దీ దృష్ట్యా తిరుగు ప్రయాణంలో భక్తులు సూర్యతండా మీదుగా వెళ్లేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. జాతరలో ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరుగకుండా మమునూరు ఏసీపీ నరేశ్‌కుమార్ ఆధ్వర్యంలో 350 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.