వర్ధన్నపేట, మార్చి 2: ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ కోసం గ్రామాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అధికారులను ఆదేశించారు. మండలంలోని కట్య్రాల గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం అంతర్గత రోడ్ల నిర్మాణాలతోపాటు డ్రైనేజీ వ్యవస్థను మరింత ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా పల్లెప్రగతిలో భాగంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి గ్రామానికి ట్రాక్టర్, మొక్కల సంరక్షణకు వాటర్ ట్యాంకర్‌ను అందించినట్లు తెలిపారు. దీనివల్ల పంచాయతీ సిబ్బంది నిత్యం గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించడం సులువుగా మారిందన్నారు. దీనివల్ల గ్రామాలు పరిశుభ్రంగా తయారవుతున్నాయన్నారు. కానీ, కొన్ని గ్రామాల్లో స్థానిక అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోతున్నట్లు తమ దృష్టికి వస్తున్నదన్నారు. పంచాయతీ సిబ్బంది ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నిత్యం పారిశుధ్య పనులు చేసేలా ప్రజాప్రతినిధులు, మండలస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్యలక్ష్మి, ఏపీవో నాగేశ్వర్ పాల్గొన్నారు.
పనులు త్వరగా పూర్తి చేయాలి
చెన్నారావుపేట: విధుల్లో నిర్లక్ష్యం చేయకుండా స్థానిక అధికారులు పల్లెప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని డీఎల్పీవో వెంకటేశ్వర్లు సూచించారు. ఎల్లాయగూడెంలో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. నర్సరీలో జరుగుతున్న పనులు, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు, గ్రామంలో పారిశుధ్య పనులను పరిశీలించి.. శానిటేషన్ పక్కాగా జరుగాలని కార్యదర్శి అవినాశ్‌ను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీవో గౌడ సురేశ్, సర్పంచ్ మంద జయాజనార్దన్ ఉన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శులతో డీఎల్పీవో సమీక్షించారు. గ్రామ పంచాయతీ పన్నుల వసూళ్లలో కార్యదర్శులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పల్లెల అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.
పకడ్బందీగా చేపట్టాలి
ఖానాపురం: గ్రామాల్లో పల్లెప్రగతి పనులను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా విజిలెన్స్ అధికారి పద్మనాభరెడ్డి సూచించారు. మనుబోతులగడ్డ గ్రామ పంచాయతీలో పల్లెప్రగతి పనులను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. వీధులకు వెళ్లి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రోజూ చెత్త సేకరణ జరుగుతుందా.. పారిశుధ్య పనులు సక్రమంగా చేస్తున్నారా.. కార్యదర్శి సమయపాలన పాటిస్తున్నారా..? అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పల్లెప్రగతి పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వల్లెపు సోమయ్య, కార్యదర్శి రాంబాబు పాల్గొన్నారు.