ఖిలావరంగల్, మార్చి 2 : చారిత్రక ఆనవాళ్లను.. సంస్కృతీ సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించే కళా సంపద మౌనంగా రోదిస్తోంది. కళాఖండాలకు రక్షణ కరువవడంతో పాటు వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ ధ్వంసమవుతుండడంతో పర్యాటకులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర పురావస్తు శాఖ అధికారుల కళ్లకు కనిపించినా.. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వారి పనితనానికి అద్దం పడుతున్నది. తెలంగాణకే తలమానికమైన చారిత్రక పర్యాటక ప్రాంతమైన ఓరుగల్లు కోటలోని కళా సంపద కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. కాకతీయుల ఆచార వ్యవహారాలను శిల్పులు అందంగా చెక్కి వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే ముష్కరులు చేసిన దాడి వల్ల చారిత్రక కట్టడాలు చెల్లాచెదురయ్యాయి. అయితే వీటిని ఒక్క చోట చేర్చి రక్షించాల్సిన శాఖలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2004లో నాటి డిప్యూటీ మేయర్ కక్కె సారయ్య, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, సూపరింటెంటెండ్ వీరభద్రరావు కీర్తి తోరణాల మధ్య తవ్వకాలు జరిపి శిల్ప సంపదను బయటకు తీసి వరుస క్రమంలో పేర్చారు. అయితే వీరి పదవీ కాలం పూర్తి కావడంతో కీర్తితోరణాల మధ్య పనులు అగిపోయాయి.
ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని వైనం..
కీర్తి తోరణాల ప్రాంగణంలో ఎరుపు, నలుపు రాళ్లతో అందంగా చెక్కిన శిల్పాలు వరుస క్రమంలో పేర్చడంలో ఆ శాఖ విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. 2012 నుంచి శిల్పాలను నిలబెట్టి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని పలు మార్లు సర్వేలు కూడా నిర్వహించారు. కానీ పనులు మాత్రం ఇంచు కూడా ముందుకు సాగలేదు. కీర్తి తోరణాల మధ్య వృద్ధులు, దివ్యాంగుల కోసం బ్యాటరీ ఆపరేటర్ వాహనం, అది నడిచేందుకు పాత్వే నిర్మించారు. ఇది మినహా కొత్తగా కీర్తి తోరణాల ప్రాంగణంలో అభివృద్ధి పనులు చేపట్టకపోవడంపై పర్యాటకులు, స్థానికులు విమర్శిస్తున్నారు. ఎంతో చారిత్ర ప్రాశస్త్యం కలిగిన కోటలోని కీర్తి తోరణాల ప్రాంగణంలో కిందపడి ఉన్న శిల్పాలను వరుస క్రమంలో నిలబెట్టి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.