వరంగల్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకువెళ్తున్నది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందించే దిశగా కార్యక్రమాలను చేపడుతున్నది. కొద్ది నెలల క్రితం వైద్య ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానలుగా తీర్చిదిద్దింది. వాటిల్లో సిబ్బందితోపాటు ఒక వైద్యుడి చొప్పున నియమించింది. ప్రత్యేక వైద్యనిపుణుల సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) నుంచి గ్రామీణ ప్రజలు వీడియో కాల్ ద్వారా వరంగల్ ఎంజీఎం దవాఖానలోని ప్రత్యేక వైద్య నిపుణులతో ఉచిత వైద్యసేవలు పొందే సౌకర్యాన్ని కల్పించింది.
స్మార్ట్ ఫోన్ల పంపిణీ
తాజాగా హెల్త్ ప్రొఫైల్ కోసం ఆశవర్కర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేస్తున్నది. వారు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలను స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రత్యేక యాప్‌లో పొందుపరుస్తున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలతోపాటు వైద్య ఆరోగ్యశాఖలోని ఏఎన్ఎంలకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసింది. ఇప్పుడు వైద్య ఆరోగ్యశాఖలోని ఆశవర్కర్లకు కూడా స్మార్ట్ఫోన్లు అందజేస్తున్నది. జిల్లాలో 693 మంది ఆశవర్కర్లు పనిచేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉచిత జియో సిమ్ కార్డులను అందజేసింది. దశల వారీగా 4జీ స్మార్ట్ ఫోన్ల పంపిణీ కొనసాగుతున్నది. జిల్లాలోని ఆశ వర్కర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నాలుగు రోజుల క్రితం ప్రారంభించారు. కలెక్టర్ బీ గోపి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె వెంకటరమణతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆరోగ్య వివరాల నమోదు
ఆశవర్కర్లు ఇన్నాళ్లు ఇంటింటికీ వెళ్లి కుటుంబంలోని సభ్యుల ఆరోగ్య వివరాలను మొదట నోటుబుక్‌లో రాసుకుని, ఆ తర్వాత ట్యాబ్‌లో నమోదు చేసేవారు. ఈ వివరాలను నివేదిక రూపంలో వైద్య ఆరోగ్యశాఖ జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు పంపేవారు. ఇప్పుడు ప్రజల హెల్త్ ప్రొఫైల్ ఆన్లైన్లో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఆశ వర్కర్లు హెల్త్ ప్రొఫైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. కుటుంబంలోని సభ్యుల ఆరోగ్య వివరాలను ఆ యాప్‌లో నమోదు చేస్తున్నారు. రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ముక్యాన్సర్, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్, క్షయ, కుష్టు, మాతా, శిశు సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాలు, మానసిక వైద్యం, పైలేరియా, మలేరియా, రక్తహీనత గుర్తింపు, కేసీఆర్ కిట్ సేవలు, కుటుంబ సంక్షేమం, సంక్రమిత వ్యాధుల కార్యక్రమాలు, రికార్డు, రిపోర్టుల నిర్వహణ వంటివి అప్లోడ్ చేస్తున్నారు. తద్వారా వైద్య ఆరోగ్యశాఖ జిల్లా, రాష్ట్ర అధికారులు ఆన్లైన్లో కుటుంబాల వారీగా ఆరోగ్య వివరాలను చూసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ హెల్త్ ప్రొఫైల్ విశ్లేషణ ద్వారా ఏ ప్రాంతంలో ఏ తీవ్రత ఎక్కువగా ఉంది?, ఏ వ్యాధితో ఎంతమంది బాధపడుతున్నారు?, నివారణ కోసం ఏ వ్యాధికి ఎంత బడ్జెట్ కేటాయించాలి?, మందులెన్ని సరఫరా చేయాలి? అనేది ప్రభుత్వానికి తెలిసిపోతుంది. ఈమేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రజలకు అవసరమైన వైద్యసేవలు సమయానికి అందించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. ఆశవర్కర్లు స్మార్ట్ ఫోన్ల ద్వారా హెల్త్ ప్రొఫైల్ యాప్‌లో ఆరోగ్య వివరాలను నమోదు చేయడాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె వెంకటరమణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు.
దశలవారీగా పంపిణీ
జిల్లాలో 693 మంది ఆశవర్కర్లు పనిచేస్తున్నారు. వీరిలో ప్రతి ఒక్కరికీ 4జీ స్మార్ట్ ఫోన్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాకు స్మార్ట్ ఫోన్లను ఇచ్చింది. వీటిని దశలవారీగా పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే స్మార్ట్ఫోన్లు పొందిన ఆశవర్కర్లు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్ ద్వారా హెల్త్యాప్లో పొందుపరుస్తుండటం వల్ల ఆన్లైన్లో ప్రజల ఆరోగ్య వివరాలను వైద్య ఆరోగ్యశాఖలోని అధికారులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని పరిశీలించి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
– వెంకటరమణ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, వరంగల్